Share News

సారా రహిత జిల్లాగా అనకాపల్లి

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:14 PM

జిల్లాను నాటుసారా రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పిలుపునిచ్చారు.

సారా రహిత జిల్లాగా అనకాపల్లి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పిలుపు

అనకాపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాను నాటుసారా రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవోదయం-2.0 అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం-2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయిలో పోలీసు, అటవీ, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సారా తయారీదారులను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. నవోదయం-2.0ను సమర్థంగా అమలు చేసేందుకు గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సారా రహిత సమాజ స్థాపన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందులో మహిళలను భాగస్వాములను చేయాలని సూచించారు. సారా విక్రయదారులను గుర్తించి ప్రత్యామ్నాయంగా గొర్రెలు, మేకల పెంపకం, చిన్నపాటి వ్యాపారాలు చేసుకొనేందుకు రుణాలు మంజూరు చేయించాలని ఆమె చెప్పారు. సమావేశంలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సుర్జిత్‌సింగ్‌, జిల్లా సూపరింటెండెంట్‌ వి.సుధీర్‌, డీఎఫ్‌వో శామ్యూల్‌, ఏఎస్పీ (క్రైమ్‌) మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:14 PM