Share News

పూర్ణామార్కెట్‌లో మళ్లీ ఆశీలు దందా

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:45 AM

పూర్ణామార్కెట్‌లో ఆశీలు దందా మళ్లీ మొదలైంది. ఇటీవల అధికారులు నిర్వహించిన వేలంలో ఒకరు రూ.81 లక్షలకు ఆశీలు వసూలు కాంట్రాక్టు దక్కించుకున్నారు.

పూర్ణామార్కెట్‌లో మళ్లీ ఆశీలు దందా

  • ఇటీవల వేలం నిర్వహణ

  • ఇంకా స్టాండింగ్‌ కమిటీ ఆమోదం

  • లభించకుండానే కలెక్షన్‌కు కొత్త కాంట్రాక్టర్‌ శ్రీకారం

  • జీవీఎంసీ పేరుతో వసూళ్లు

  • రోడ్డుపై గతంలో తొలగించిన జంగిడీలను తిరిగి ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సాహం

  • ఒక్కో వ్యాపారి నుంచి రూ.300 వసూలు

  • పార్కింగ్‌ ఫీజు రెట్టింపు వ సూలు

  • చోద్యంచూస్తున్న పోలీసులు, జీవీఎంసీ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పూర్ణామార్కెట్‌లో ఆశీలు దందా మళ్లీ మొదలైంది. ఇటీవల అధికారులు నిర్వహించిన వేలంలో ఒకరు రూ.81 లక్షలకు ఆశీలు వసూలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. అయితే ఇంకా స్టాండింగ్‌ కమిటీ ఆమోదించాల్సి ఉంది. అప్పటివరకూ జీవీఎంసీ డిపార్టుమెంట్‌ ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా, ఆ పేరుతో కొత్త కాంట్రాక్టరే కలెక్షన్‌ మొదలెట్టేశారు. గతంలో మాదిరిగా రోడ్డుపై జంగిడీలు కూడా పెట్టించారు. పార్కింగ్‌ ఫీజులు కూడా గెజిట్‌కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులుగానీ, పోలీస్‌ అధికారులుగానీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పూర్ణామార్కెట్‌లోని దుకాణాల నుంచి ఆశీలు, అక్కడ పార్కింగ్‌ ఫీజు వసూలు కోసం జీవీఎంసీ జోన్‌-4 అధికారులు ఏటా వేలం నిర్వహిస్తుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ గెజిట్‌లో పేర్కొన్న ధరల ప్రకారం ఆశీలు, పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునేలా ఇటీవల అధికారులు వేలం నిర్వహించారు. రూ.81 లక్షలకు ఒకరు కాంట్రాక్టు దక్కించుకున్నారు. వేలం పాటకు సంబంధించిన ఫైల్‌ను జోన్‌-4 రెవెన్యూ అధికారులు స్టాండింగ్‌ కమిటీకి పంపిస్తే, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేలం పాట నిర్వహణలో లోపాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నా, ఆశించిన ధర కంటే తక్కువ వచ్చినట్టు సభ్యులు భావించినా తిరిగి వేలం నిర్వహించాలని ఆదేశించవచ్చు. అంతా సక్రమంగానే జరిగిందని భావిస్తే వేలం పాటను ఆమోదించవచ్చు. స్టాండింగ్‌ కమిటీ ఆమోదిస్తే జోన్‌-4 రెవెన్యూ అధికారులు వేలంపాటలో కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తికి వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారు. వర్క్‌ ఆర్డర్‌ అందుకున్న తర్వాతే కాంట్రాక్టర్‌ ఆశీలు, పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు వీలుంటుంది. వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆ మేరకు వేలం మొత్తంలో (ఏప్రిల్‌ 1 నుంచి లెక్కలోకి తీసుకుంటారు) కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ మినహాయింపు ఇస్తుంది. అయితే ఇటీవల కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి ఇంకా స్టాండింగ్‌ కమిటీ ఆమోదం లభించకుండానే మంగళవారం నుంచి ఆశీలు, పార్కింగ్‌ ఫీజు వసూలు ప్రారంభించేశారు. పైగా గతంలో తొలగించిన జంగిడీలను తిరిగి రోడ్డుపై పెట్టుకోవాలంటూ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. వారి వద్ద నుంచి రూ.300 చొప్పున ఆశీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు జీవీఎంసీ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. అలాగే కారుకు రూ.పది, బైక్‌కు రూ.ఐదు చొప్పున పార్కింగ్‌ఫీజు వసూలు చేయాలని బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ కారుకు రూ.20, బైక్‌కు రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే జీవీఎంసీ డిపార్టుమెంట్‌ తరపున కలెక్షన్‌ చేస్తున్నామని, తమకు ఇంకా వర్కు ఆర్డరు ఇవ్వలేదని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. ఈ విషయమై ఆధారాలతో సహా ఒకరు మంగళవారం జీవీఎంసీ జోన్‌-4 అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. రోడ్డుపై జంగిడీలు, తోపుడుబండ్లు పెట్టడం వల్ల ట్రాఫిక్‌జామ్‌ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం జోన్‌-4 కమిషనర్‌ మల్లయ్యనాయుడు వద్ద ప్రస్తావించగా, స్టాండింగ్‌ కమిటీ ఆమోదం లేకుండా కాంట్రాక్టర్‌ ఆశీలు వసూలు చేయడానికి వీల్లేదన్నారు. రోడ్డుపై జంగిడీలు పెట్టించినట్టు, మంగళవారం నుంచే ఆశీలు వసూలుచేస్తున్నట్టు, రెట్టింపు పార్కింగ్‌ ఫీజు వసూలుచేస్తున్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. బుధవారం తానే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి పరిస్థితి గతంలో మాదిరిగా ఉండేలా చర్యలు తీసుకుంటానన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:45 AM