నువ్వులో కొత్త వంగడం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:20 AM
ఎలమంచిలిలోని (కొక్కిరాపల్లి) వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రాస్త్రవేత్తలు కొత్త నువ్వు వంగడం ‘వైఎల్‌ఎం 146’ను రూపొందించారు. ఇది ‘వైఎల్‌ఎం 66’ రకం కన్నా అధిక దిగుబడి ఇస్తుంది. కేంద్ర విత్తన ఎంపిక కమిటీ ఈ వంగడం విడుదలకు ఆమోదం తెలిపింది.

‘వైఎల్‌ఎం 146’ పేరుతో అభివృద్ధి చేసిన ఎలమంచిలి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
ఎకరాకు 5-6 క్వింటాళ్ల దిగుబడి
వచ్చే రబీ సీజన్‌లో రైతులకు అందుబాటులోకి విత్తనం
అనకాపల్లి అగ్రికల్చర్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలిలోని (కొక్కిరాపల్లి) వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రాస్త్రవేత్తలు కొత్త నువ్వు వంగడం ‘వైఎల్‌ఎం 146’ను రూపొందించారు. ఇది ‘వైఎల్‌ఎం 66’ రకం కన్నా అధిక దిగుబడి ఇస్తుంది. కేంద్ర విత్తన ఎంపిక కమిటీ ఈ వంగడం విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ వంగడంపై గత ఏడాది నుంచి పలు పరిశోధనలు జరిపిన సేద్య శాస్త్రవేత్తలు.. దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న ‘వైఎల్‌ఎం 66’ నువ్వు పంట ఎకరాలకు రెండు, మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి ఇస్తున్నది. ‘వైఎల్‌ఎం 146’ రకంం ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తల ప్రయోగాత్మక సాగులో నిర్ధారణ అయ్యింది. విత్తిన 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకొస్తుంది. విత్తనం లేత గోధుమ రంగులో ఉండి నూనె 49 శాతం వస్తుంది. బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. జనవరి లేదా మే నెలల్లో విత్తుకోవడానికి ఇది అత్యంత అనుకూలమని శాస్త్రవేత్త శిరీష తెలిపారు. ‘వైఎల్‌ఎం 146’ రకం నువ్వు విత్తనాన్ని త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నారు. వచ్చే సీజన్ నాటికి రైతులకు అందుబాటులోకి వస్తుందని అనకాపల్లి ఆర్‌ఎఆర్‌ఎస్ సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.వి.రమణమూర్తి తెలిపారు.