Share News

మత్స్యకారులకు భరోసా

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:28 AM

సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక పండగ చేయనుంది.

మత్స్యకారులకు భరోసా

  • సముద్రంలో వేట నిషేధ సమయంలో రూ.20 వేల చొప్పున భృతి

  • ఒకేసారి రెట్టింపు చేసిన కూటమి ప్రభుత్వం

  • ఎన్నికల హామీని నిలుపుకున్న పాలకులు

  • జిల్లాలో గత ఏడాది 2,168 మంది లబ్ధిదారులు

  • ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం

  • నేటి నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేటకు విరామం

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక పండగ చేయనుంది. తాము అధికారంలోకి వస్తే.. సముద్రంలో చేపల వేటపై నిషేధ సమయంలో ఇస్తున్న పరిహారాన్ని రెట్టింపు చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో వేట నిషేధ కాలం పూర్తయిన తర్వాత మత్స్యకారులకు పరిహారాన్ని అందజేసేవారు. కానీ ఈ ఏడాది ముందుగానే పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

సముద్రంలో రొయ్యలు, చేపలు, ఇతర ఇతర సముద్ర జాతులకు వేసవి కాలం పునరుత్పత్తి సమయం. ఏడాదిలో పది నెలలపాటు సముద్రంలో వేట సాఫీగా సాగాలంటే రెండు నెలలపాటు వేటకు విరామం ఇవ్వాలి. మత్స్య సంపద గుడ్లు పెట్టే సమయంలో వాటికి భంగం కలిగించకుండా వుండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొనేళ్లుగా సముద్రంలో వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. గతంలో 40 రోజులు ఉండే ఈ నిషేధ సమయాన్ని 60 రోజులకు పెంచారు. పదేళ్ల క్రితం వరకు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతికోసం బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున నగదు ఇవ్వడం ప్రారంభమైంది. తర్వాత రూ.4 వేలుకు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని రూ.10 వేలకు పెంచారు. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధసమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందజేస్తామని గత ఏడాది ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో సముద్ర తీరం వెంబడి పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, ఎస్‌రాయవరం, పాయకరావుపేట మండలాలు వున్నాయి. ఆయా మండలాల్లోని పూడిమడక, బంగారమ్మపాలెం, రాజయ్యపేట, బోయపాలెం, రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం, వెంకటనగరం, రాజానగరం, కొత్తపట్నం, వాడ నర్సాపురం, పాల్మన్‌పేట, కొర్లయ్యపాలెం, డీఎల్‌పురం, గజపతినగరం, పెదతీనార్ల గ్రామాల్లో సముద్రంపై చేపల వేట సాగించే మత్స్యకారులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర సంపద వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. గత ఏడాది జిల్లాలో 2,168 మంది మత్స్యకారులు చేపల వేట నిషేధ భృతికి అర్హులుగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది వుంటారని అధికారులు చెబుతున్నారు. డీజిల్‌ ఇంజన్‌తో నడిచే పడవకు ఆరుగురు, తెడ్డుతో నడిచే పడవకు ముగ్గురు, సోనాబోట్లు (ట్రాలర్లు)కు ఎనిమిది మంది చొప్పున వేట నిషేధ భృతికి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ మేరకు జిల్లాలో వున్న మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.4,33,60,000 వేట నిషేధ భృతి కింద అందనున్నది. అధికారులు ఇప్పటికే ఆయా మత్స్యకారుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఆయా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతుంది.

Updated Date - Apr 15 , 2025 | 01:28 AM