Share News

వైసీపీకి బెహరా గుడ్‌బై

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:16 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరొక నేత గుడ్‌బై చెప్పేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మండల అధ్యక్షునిగా పనిచేస్తున్న బెహరా భాస్కరరావు పార్టీ పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసి, జనసేనలో చేరుతున్నట్టు సోమవారం ప్రకటించారు.

వైసీపీకి బెహరా గుడ్‌బై

త్వరలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిక

విశాఖపట్నం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరొక నేత గుడ్‌బై చెప్పేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మండల అధ్యక్షునిగా పనిచేస్తున్న బెహరా భాస్కరరావు పార్టీ పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసి, జనసేనలో చేరుతున్నట్టు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక లేఖను విడుదల చేశారు.

బెహరా భాస్కరరావు కొంతకాలం కిందటివరకూ జీవీఎంసీలో కో-ఆప్షన్‌ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భార్య, కోడలు ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వగా ఈనెల 19న కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రకటించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి కనీసం 74 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కూటమికి ప్రస్తుతం 73 మంది బలమే ఉండడంతోపాటు తమతో ఉన్న కొందరి తీరుపై నేతలకు అనుమానాలు ఉండడంతో మరింత మంది మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బెహరా భాస్కరరావుతో కూటమి నేతలు గతకొద్దిరోజులుగా సంప్రతింపులు జరుపుతున్నారు. టీడీపీలో ఆయన్ను చేర్చుకునేందుకు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అభ్యంతరం చెప్పడంతో జనసేనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రచారం జరిగింది. జనసేనలో చేరాలంటే తనకు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని బెహరా షరతుపెట్టినట్టు సమాచారం. అందుకు జనసేన పశ్చిమ నియోజకవర్గ నేతలు ససేమిరా అనడంతో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ గత రెండు రోజులుగా బెహరాతోపాటు జనసేన అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఇవి సోమవారానికి ఒక కొలిక్కి రావడంతో బెహరా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బెహరా కుటుంబంలోని ఇద్దరు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. దీంతో కూటమి నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:16 AM