మండిన నగరం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:05 AM
వేసవి నేపథ్యంలో నగరంలో ఆదివారం ఎండ సుర్రుమనిపించింది.

36.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు
తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు
విశాఖపట్నం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
వేసవి నేపథ్యంలో నగరంలో ఆదివారం ఎండ సుర్రుమనిపించింది. రెండు మూడు రోజులుపాటు మధ్యాహ్నం వరకు మేఘాలు ఆవరించడంతో చల్లబడిన నగరవాసులు ఆదివారం ఎండతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉదయం నుంచే ఎండ, ఉక్కపోత కలబోతగా మారడంతో ఇళ్లలో ఉన్నవారు సైతం ఆపసోపాలు పడ్డారు. దీనికితోడు ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్శంగా రామాలయాలకు వెళ్లిన వారంతా భానుడి తాపానికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం గ్రామీణ ప్రాంతాల్లో వర్షంకురిసినా నగరంలో ఆ జాడ లేకపోవడంతో మరింత ఉక్కపోత పెరిగింది. వివిధ పనులమీద బయటకు వెళ్లినవారు, రామాలయాల్లో పూజలకు వెళ్లినవారు తిరిగి వచ్చే సమయంలో నానాపాట్లు పడ్డారు. నగరవాసులు వేసవితాపం నుంచి సేదతీరేందుకు సాయంత్రం ఆర్కే బీచ్, రుషికొండ తీరాలకు వెళ్లడంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం ఎయిర్‌పోర్టు వద్ద 36.6 డిగ్రీలు ఉష్ణోగత్ర నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఎండల మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఒకవేళ వచ్చినా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలావుండగా నగరంలో ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు స్వాంతన చేకూర్చేందుకు వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, యువకులు ప్రజలకు తాగునీరు, మజ్జిగ, పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు. వన్‌టౌన్‌లోని పందుపుళ్లల సందు వద్ద యువకులు, చిన్నారులు ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులు, ఆటోల్లో ప్రయాణించేవారికి పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు.
ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌టీ కార్నర్స్
జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో ఏర్పాటు
ఎండ తీవ్రత నేపథ్యంలో ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆరోగ్యశాఖ ఆదేశాలు
ప్రతి సెంటర్‌లో సిబ్బంది, ఓఆర్‌ఎస్ ద్రావణం ఉండేలా చర్యలు
ఒక్కో కేంద్రానికి వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ
సిద్ధంగా ఉన్న మరో 60 వేల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
విశాఖపట్నం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎండ వేడిమి వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజలకు ఒకపక్క అవగాహన కల్పిస్తూనే.. మరోపక్క ప్రజలకు సేవలందించేందుకు ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. జిల్లావ్యాప్తంగా ఓఆర్‌టీ (ఓరల్ రీహైడ్రేషన్ థెరఫీ) కార్నర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆదేశాలను జారీ చేసింది. ఈ ఓఆర్‌టీ కార్నర్స్‌ను జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 54 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 66 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల సిబ్బంది వీటిని ఏర్పాటు చేయగా, మిగిలిన వాళ్లు కూడా సోమవారం నాటికి ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. ఓఆర్‌టీ కార్నర్స్ నిర్వహణకు అనుగుణంగా పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఐదు వేల చొప్పున, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు వెయ్యి చొప్పున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రానున్న మూడు నెలలపాటు ఈ కేంద్రాలు నడిచేలా సిబ్బందికి ఆదేశాలు అందాయి. తొలి దశలో ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌టీ కార్నర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతను బట్టి రానున్న రోజుల్లో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, అంగన్వాడీ కేంద్రాలతోపాటు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కార్నర్స్ వద్ద తప్పనిసరిగా ఆరోగ్యశాఖకు చెందిన ఒక సిబ్బంది ఉంటారు. రోగులతో పాటు కార్నర్ వద్దకు వచ్చే ప్రజలకు వీటిని తప్పనిసరిగా అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు సూచించారు.
అందుబాటులో మరో 60 వేలు..
ప్రస్తుతం జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు సుమారు ఐదు లక్షల వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అధికారులు పంపిణీ చేశారు. పెదవాల్తేరులోని సెంట్రల్ స్టోర్‌లో మరో 60 వేల వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల్లో జిల్లాకు మరో రెండు లక్షల వరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వస్తాయని వారు చెబుతున్నారు. వీటిని ఆయా కేంద్రాల అవసరాల మేరకు పంపిస్తామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే కేంద్రాలకు కూడా సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజలకు ఆరోగ్యశాఖ సూచనలు..
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందరూ ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని, లేత వర్ణం, తేలికైన, కాటన్ దుస్తులను ధరించాలని వెల్లడించారు. రోజూ కనీసం 15 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భోజనం మితంగా చేయాలని, మిట్టమధ్యాహ్నం వేళ ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటి వాటిని ధరించాలని, ఇంట్లో కిటికీలను తెరిచి ఉంచాలని, సూర్య కిరణాలు, వేడి గాలులు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌పై విక్రయించే చల్లని, రంగు పానీయాలకు దూరంగా ఉండాలని, మాంసాహారాన్ని తగ్గించాలని, మద్యం సేవించకపోవడమే మేలని తెలిపారు. ఎండ వేళ శరీరంపై భారం పడే పనులకు దూరంగా ఉండాలని, నలుపు దుస్తులు, మందంగా ఉండే దుస్తులను ధరించకూడదని అధికారులు తెలిపారు.
డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- డాక్టర్ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
వేసవి దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బయట పనిచేసేవాళ్లు, ప్రయాణాలు సాగించేవారు అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య బయటకు రాకుండా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేంత వరకు ఇలా చేస్తుండాలి. ఓఆర్‌టీ కార్నర్స్‌లో ఇచ్చే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. దీనివల్ల శరీరం ఎండ వేడిమి వల్ల ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుంది.