పరవాడలో పట్టపగలు చోరీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:39 AM
పరవాడలో తాళం వేసిన ఓ ఇంట్లో మంగళవారం పట్టపగలు చోరీ జరిగింది. ప్రధాన ద్వారం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలతోపాటు 25 తులాల వెండి పట్టీలు, కొంత నగదుతో ఉడాయించారు. ఇందుకు సంబంధించి సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

8 తులాల బంగారం, 25 తులాల వెండి అపహరణ
పరవాడ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): పరవాడలో తాళం వేసిన ఓ ఇంట్లో మంగళవారం పట్టపగలు చోరీ జరిగింది. ప్రధాన ద్వారం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలతోపాటు 25 తులాల వెండి పట్టీలు, కొంత నగదుతో ఉడాయించారు. ఇందుకు సంబంధించి సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పరవాడకు చెందిన లాలం రవణమ్మ స్థానిక మార్కెట్ సమీపంలో నివాసం వుంటున్నది. సినిమా హాల్ జంక్షన్‌లో టిఫిన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నది. రోజూ తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు టిఫిన్ సెంటర్‌లో వుంటుంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం వ్యాపారం ముగించుకొని 10.30 గంటలకు ఇంటికి వచ్చింది. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి ఉండడంతో ఆందోళన చెంది లోపలికి వెళ్లి చూడగా మంచం కింద భద్రపరిచిన చెక్కపెట్ట పగలగొట్టి వుంది. ఇందులో దాచుకున్న నాలుగున్నర తులాల బంగారం, 25 తులాల వెండి పట్టీలు, కొంత నగదు, దేవుడి పటం వెనుక ఉంచిన మూడున్నర తులాల బంగారం పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు వెళ్లి, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం వచ్చి పలుచోట్ల వేలిముద్రల ఆధారాలను సేకరించింది. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.