గంజాయి జోలికి పోవద్దు
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:41 AM
గిరిజన ప్రాంతంలోని యువత గంజాయి జోలికి పోవద్దని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ కోరారు. డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు గంజాయిని విడనాడి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు.

అడవులకు నిప్పు పెట్టవద్దు
మూఢ నమ్మకాలను విడనాడండి
గిరిజనులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచన
రహదారుల నిర్మాణానికి అటవీశాఖ ఆంక్షలు తొలగించండి
డిప్యూటీ సీఎంను కోరిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
నాలుగేళ్లలో ప్రతి మారుమూల పల్లెకూ రహదారి
కలెక్టర్ దినేశ్‌కుమార్
డుంబ్రిగుడ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలోని యువత గంజాయి జోలికి పోవద్దని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ కోరారు. డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు గంజాయిని విడనాడి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. గంజాయి వలన జరిగే నష్టాలను గుర్తించాలని ప్రజలను, గంజాయిని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలని అధికారులను ఆయన కోరారు. తొలి నుంచి తాను గంజాయిని సామాజిక, ఆర్థిక సమస్యగానే చూస్తున్నానని, ప్రజలు దయ ఉంచి గంజాయికి దూరం కావాలన్నారు. ఇక్కడ ఎంతో చక్కగా ఉన్న ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలక్ష్యంగా అడవులకు నిప్పు పెట్టి పర్యావరణానికి ముప్పు తేవద్దని ఆయన కోరారు. చక్కగా ఉన్న అడవులను మన నిర్లక్ష్యంతో ఊరకనే నిప్పు పెట్టడడం వల్ల కార్చిచ్చుగా మారుతుందని, దీంతో ఎంతో నష్టం కలుగుతుందని, తాజాగా లాస్‌ఏంజిల్‌లో జరిగిన కార్చిచ్చు కారణంగా జనం సర్వం కోల్పోయారని ఉదాహరణగా తెలిపారు. పోలీసు అధికారుల సూచన మేరకు మూఢ నమ్మకాల జోలికి వెళ్లవద్దని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కోరారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చిల్లంగి నేపథ్యంలో గతంలో 9 హత్యలు జరిగాయని, అటువంటి వాటిని నమ్మవద్దన్నారు. ఈ రోజుల్లో అటువంటివి లేవని, కేవలం సినిమాల్లో, నవలల్లో మాత్రమే చిల్లంగిలున్నాయన్నారు. మన మనసును బలంగా ఉంచుకుంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. అసెంబ్లీ గేటు దాటలేరని తనను రాజకీయంగా విమర్శించిన అంశాన్ని ప్రస్తావించి, బలంగా సంకల్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఉదహరించారు. మూఢనమ్మకాలకు లోనుకాకూడదని బలంగా ఉండాలని, అధికారులు ’వికాస్’ అనే కార్యక్రమంలో వాటిని రూపుమాపేందుకు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా సభా వేదికపై వికాస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రోడ్ల నిర్మాణాలకు అటవీ ఆంక్షలు తొలగించాలి
గిరిజన ప్రాంతానికి మంజూరవుతున్న రోడ్ల నిర్మాణానికి అటవీ ఆంక్షలు లేకుండా చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. డుంబ్రిగుడ సభలో ఆమె మాట్లాడుతూ వివిధ పథకాల్లో భాగంగా గిరిజన ప్రాంతాలకు రోడ్లను మంజూరు చేస్తున్నందుకు డిప్యూటీ సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ ఆంక్షలు విధించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని తొలగించాలన్నారు. అలాగే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు 125 బహుళ ప్రయోజన భవనాలను మంజూరు చేస్తే, వాటిలో 35 భవనాలు పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు కేటాయించామన్నారు. విద్యాలయాలకు రాష్ట్రంలో రూ.150 కోట్లలో ఈ ప్రాంతానికి రూ.34 కోట్లు కేటాయించామన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో రూ.కోటి చొప్పున బహుళ మార్కెట్ కేంద్రాలను మంజూరు చేశామన్నారు. గిరిజన ప్రాంతాలను డోలీ రహితం చేసేందుకు విరివిగా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆమె ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కోరారు. అలాగే మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెలా ఏదో గిరిజన ప్రాంతంలో ఆయన పర్యటించడం ఎంతో సంతోషమని, ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.
నాలుగేళ్లలో మారుమూల పల్లెలకు రోడ్లు
ప్రభుత్వ సహకారంతో రానున్న నాలుగేళ్లలో గిరిజన ప్రాంతంలో ప్రతి మారుమూల పల్లెకు రోడ్డు సదుపాయం కలుగుతుందని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు. డుంబ్రిగుడ సభలో ఆయన మాట్లాడుతూ డోలీ మోతల సమస్యలున్న గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రూ.454 కోట్లు మంజూరు చేశారని, ఉపాధి హామీ పథకంలో రూ.250 కోట్లతో సీసీ, మెటల్ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి సీఎం ఆమోదం తెలిపారని, కాఫీ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కోరారు. కాఫీ, మిరియాలను అభివృద్ధి చేసి జిల్లాను ఆర్థికంగా ముందంజలో ఉంచుతామని, జిల్లాకు రెండు మార్లు వచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎంకు జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజల తరఫున కలెక్టర్ దినేశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పీఆర్ ఈఎన్‌సీ బాలునాయక్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, డివిజనల్ అటవీ అధికారి పీవీ.సందీప్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీపీవో బి.లవరాజు, ఎమ్మెల్సీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేశ్‌బాబు, జయకృష్ణ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన పార్లమెంట్ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య, కాఫీ బోర్డు డైరెక్టర్ కె.ఉమామహేశ్వరరావు, ట్రైకార్ డైరెక్టర్ కె.కృష్ణారావు, ఎంపీపీ బి.ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.గీత, వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.