108 సూర్య నమస్కారాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:25 PM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించనున్న 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
20 వేల మంది విద్యార్థులతో ప్రదర్శన
200 మంది పీడీలు, పీఈటీ, టీచర్ల పర్యవేక్షణ
600 మంది పోలీసులతో బందోబస్తు
అరకులోయ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించనున్న 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదివారం ఈ ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 20 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులతో ఈ ప్రదర్శన చేయనున్నారు. ఏజెన్సీలోని 60 ఆశ్రమ పాఠశాలల నుంచి వీరిని ఇక్కడికి తరలించనున్నారు. 200 మంది పీడీలు, పీఈటీలు, టీచర్లు వీరిని పర్యవేక్షించనున్నారు. 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం వద్ద విద్యార్థులు సూర్యనమస్కారాలు చేసేందుకు వీలుగా గ్రీన్ కార్పెట్‌ను పరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సూర్య నమస్కారాల కార్యక్రమానికి ఆయా పాఠశాలల్లో ఉన్న 20 వేల మంది బాలబాలికలను బస్సుల్లో ఇక్కడకు తీసుకువస్తామని, అనంతరం వసతి గృహాలకు తరలించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, లండన్ నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందాన్ని కూడా ఆహ్వానించామని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, ఆయన వచ్చే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వెంట జేసీ అభిషేక్‌గౌడ్, ఎస్పీ అమిత్‌బర్ధార్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ ధీరజ్, ఆర్టీసీ విజయనగరం జోన్ రీజినల్ చైర్మన్ సీవేరి దొన్నుదొర, సర్పంచ్ దాసుబాబు, టీడీపీ నాయకుడు బాబురావు, తదితరులు ఉన్నారు.