నర్సు పోస్టులకు ఫేక్ సర్టిఫికెట్లు!
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:15 AM
వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయాలని భావించిన అధికారులకు ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం తొలనొప్పిగా మారింది.

వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 370 ఖాళీల భర్తీకి మూడు నెలల కిందట నోటిఫికేషన్
8,300 మంది దరఖాస్తు
కొవిడ్ సమయంలో పని చేయకుండానే చేసినట్టు సర్టిఫికెట్లు జత చేసిన పలువురు అభ్యర్థులు
గుర్తించిన అధికారులు
కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కళాశాల, శ్రీకాకుళంలోని జనరల్ ఆస్పత్రి పేర్లతో జారీ
తుది దశకు ఎంపిక ప్రక్రియ...దళారుల రంగ ప్రవేశం
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఆర్డీ డాక్టర్ రాధారాణి
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయాలని భావించిన అధికారులకు ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం తొలనొప్పిగా మారింది. తాము కొవిడ్ సమయంలో పనిచేసినట్టు కొందరు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకోవాల్సి రావడంతో నియామక ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
ఆర్డీ కార్యాలయ పరిధిలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 106 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, సుమారు 8,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత మరికొన్ని ఖాళీలను గుర్తించారు. దాంతో పోస్టుల సంఖ్య 370కు చేరింది. భారీగా వచ్చిన దరఖాస్తులను వడపోసిన అధికారులు కొందరు ఫేక్ సర్టిఫికెట్లు (కరోనా సమయంలో పని చేయకుండానే చేసినట్టు) జత చేసినట్టు గుర్తించారు. ఆయా సర్టిఫికెట్లను మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులకు పంపించి పునఃపరిశీలన చేయించారు. ఇప్పటివరకూ 14 మంది జత చేసినవి ఫేక్ కొవిడ్ సర్టిఫికెట్లుగా అధికారులు నిర్ధారించారు. మరికొన్ని నిర్ధారణ కావాల్సి ఉందని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే గుర్తించిన 14 ఫేక్ సర్టిఫికెట్లు కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీ, శ్రీకాకుళంలోని జనరల్ ఆస్పత్రి నుంచి తెచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఈ సర్టిఫికెట్లు అందించేందుకు అక్కడి సిబ్బంది డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో కొవిడ్‌లో పనిచేసిన వారికి కొంత వెయిటేజీ ఇస్తున్నారు. దీంతో ఆ సర్టిఫికెట్‌కు డిమాండ్ పెరిగింది. దానిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్‌లను కొందరు అభ్యర్థులకు కేజీహెచ్‌లోని నర్సింగ్ అసోసియేషన్‌లో కీలకంగా పనిచేసే వ్యక్తి ఇస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై కేజీహెచ్, మెడికల్ కాలేజీ అధికారులు విచారణ చేయాలని, అప్పుడే ఈ తరహా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉంటుందని కోరుతున్నారు.
రెండు రోజుల్లో మెరిట్ లిస్ట్
రెండు రోజుల్లో ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ప్రక్రియను పూర్తి చేశామని, కొందరు అభ్యర్థుల సర్టిఫికెట్లపై స్పష్టత వచ్చిన వెంటనే జాబితా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఫైనల్ మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి నివృత్తి చేసిన తరువాతే సెలక్షన్ లిస్టు పెడతామని ఆర్డీ రాధారాణి వెల్లడించారు.
రంగంలోకి దళారులు
నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో కొందరు దళారులు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మెరిట్‌లో ఉన్న అభ్యర్థుల వివరాలను సేకరించి, వారికి ఫోన్లు చేసి డబ్బులు ఇస్తే ఉద్యోగం వచ్చేలా చేస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అటువంటి వారిపై ఫిర్యాదులు చేయాలని ఆర్డీ పి.రాధారాణి కోరుతున్నారు. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగాలు వస్తాయని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.