Share News

గ్రావెల్‌ దందా

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:33 AM

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు, మండలంలోని వివిధ గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు పెద్ద మొత్తంలో గ్రావెల్‌ అవసరం అవుతున్నది. దీంతో కొంతమంది అక్రమార్కులు కొండపోరంబోకు భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి ఇటీవల కూటమిలోని ఒక పార్టీలో చేరిన నాయకులు, నియోజకవర్గస్థాయి నేత అండదండలతో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రావెల్‌ దందా
చోడపల్లి కొండ వద్ద గ్రావెల్‌ తవ్విన ప్రదేశం

అచ్యుతాపురం మండలంలో యథేచ్ఛగా దోపిడీ

రాత్రి పూట ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు, టిప్పర్లతో తరలింపు

ఒక్కో లోడు రూ.5-8 వేలకు విక్రయం

కూటమిలో ఒక పార్టీకి చెందిన నేతల అక్రమాలు

గతంలో వైసీపీ.. ఇటీవలే కండువాలు మార్చిన నాయకులు

నియోజకవర్గస్థాయి నేత అండ

పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు, మండలంలోని వివిధ గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు పెద్ద మొత్తంలో గ్రావెల్‌ అవసరం అవుతున్నది. దీంతో కొంతమంది అక్రమార్కులు కొండపోరంబోకు భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి ఇటీవల కూటమిలోని ఒక పార్టీలో చేరిన నాయకులు, నియోజకవర్గస్థాయి నేత అండదండలతో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అచ్యుతాపురం మండలంలో చోడపల్లి, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, ఎంజేపురం, నడింపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్‌ వుంది. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో నిరంతరం కొత్తపరిశ్రమల ఏర్పాటు పనులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రదేశాలను ఎత్తు చేయడానికి, పునాదులు నింపడానికి పెద్ద మొత్తంలో గ్రావెల్‌ కావాలి. అదే విధంగా అచ్యుతాపురం మండలం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి గ్రావెల్‌ అవసరం అవుతున్నది. దీనిని సొమ్ముచేసుకోవాలని కూటమిలోని రెండు పార్టీల నేతలు భావించారు. ఇటీవల వైసీపీ నుంచి అధికారంలో వున్న ఒక రాజకీయ పార్టీలో చేరిన నాయకులు గ్రావెల్‌ దందా జరుపుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో వున్నప్పుడు కూడా వీరే గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే వీరు కూడా పార్టీ కండువాలు మార్చేశారు. నియోజకవర్గస్థాయి నేత అండదండలతో రెచ్చిపోతున్నారు. గనులు, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా కొండపోరంబోకు భూములు, నిరుపయోగంగా మారిన చెరువుల్లో గ్రావెల్‌/ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఎక్స్‌కవేటర్లతో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు గ్రావెల్‌ తవ్వి, టిప్పర్‌ లారీలతో రవాణా చేస్తున్నారు. దూరాన్నిబట్టి ఒక్కో లోడుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. పగటిపూట ఆయా ప్రాంతాలకు వెళితే గ్రావెల్‌ తవ్వుతున్న ఆనవాళ్లు కనిపిస్తాయే తప్ప వాహనాలు ఏవీ వుండవు. గ్రావెల్‌ అక్రమ తవ్వకాల విషయం మండల అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ అడ్డుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల్లో కొంతమంది అధికారులు, సిబ్బందికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెబుతుండడంతోపాటు అధికారంలో వున్న ఒక పార్టీ నేతలు కావడంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 03 , 2025 | 01:33 AM