Share News

ఇష్టానుసారంగా గ్రావెల్‌ తవ్వకాలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:13 AM

గంగవరం లేఅవుట్‌లో అక్రమార్కులు ఇష్టానుసారంగా గ్రావెల్‌ను తవ్వేశారని, ఈ లేఅవుట్‌లో 800 ప్లాట్లలో దారుణంగా తవ్వకాలు జరపడంతో అవి కనిపించకుండాపోయాయని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు అన్నారు.

ఇష్టానుసారంగా గ్రావెల్‌ తవ్వకాలు
గంగవరం లేఅవుట్‌లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బత్తుల తాతయ్యబాబు

- గంగవరం లేఅవుట్‌లో 800 ప్లాట్లు కనుమరుగు

- వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం

- భవిష్యత్తులో తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం

- రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు

సబ్బవరం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): గంగవరం లేఅవుట్‌లో అక్రమార్కులు ఇష్టానుసారంగా గ్రావెల్‌ను తవ్వేశారని, ఈ లేఅవుట్‌లో 800 ప్లాట్లలో దారుణంగా తవ్వకాలు జరపడంతో అవి కనిపించకుండాపోయాయని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు అన్నారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో నిర్మాణంలో ఉన్న ఎన్టీఆర్‌ గృహాలను అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. లేఅవుట్‌లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగవరం లేఅవుట్‌లో ఇంత దారుణంగా గ్రావెల్‌ తవ్వుకుపోయారంటే నమ్మలేకపోతున్నానన్నారు. అధికారులు గంగవరం లేఅవుట్‌లో 800 ప్లాట్లు కనిపించడం లేదని అంటే ఏమిటో అనుకున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గంగవరంలో 7130 ప్లాట్లకు 800, నంగినారపాడులో 6,522కి 150, గొల్లలపాలెంలో 5250కి 90, పైడివాడఅగ్రహారంలో 8300కి 200 ప్లాట్లు గ్రావెల్‌ తవ్వకాల వలన కనిపించకుండా పోయాయన్నారు. కొన్నిచోట్ల రోడ్లు, విద్యుత్‌ హెచ్‌టీ లైన్ల కింద కూడా తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్‌ తవ్వకాలపై సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. విశాఖ, అనకాపల్లి కలెక్టర్లతో చర్చించి ఇకపై లేఅవుట్లలో ఎటువంటి తవ్వకాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్‌ ఈఈ ఎ.శ్రీనివాసరావు, డీఈ కేవీ సూర్యారావు, ఏఈ ఎంఎం నాయుడు, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:13 AM