మన్యంలో వడగళ్ల వర్షం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:32 PM
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం మధ్యాహ్నం నుంచి వడగళ్ల వర్షం కురిసింది.

మధ్యాహ్నం నుంచి కుండపోత
లోతట్టు ప్రాంతాలు జలమయం
పాడేరురూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం మధ్యాహ్నం నుంచి వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట తరువాత ఆకాశం మేఘావృతమై 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షానికి పట్టణంలో రోడ్డు పక్క చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణ ప్రధాన రహదారులు బురదమయంగా మారాయి. ఉదయం 6.30 గంటల వరకు పొగ మంచు కురిసింది. ఉదయం 10 గంటల నుంచి భానుడు ప్రతాపాన్ని చూపడంతో మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. అనంతరం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది.
చింతపల్లిలో..
మండలంలో ఆదివారం వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కుండపోత వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలకు వర్షపు నీరు చేరుకున్నది. వర్షం వల్ల కోరుకొండ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
గూడెంకొత్తవీధిలో..
మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకున్నది. వర్షంతో మామిడి తోటల్లో కాయలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీలేరులో..
జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో సేదదీరారు.