పరిశ్రమల ఖిల్లాగా జిల్లా
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:15 AM
ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, సుస్థిరత ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర-2047పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం, రైలు, రోడ్డు రవాణా మార్గాలు అందుబాటులో ఉండడంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి, అనకాపల్లి, నక్కపల్లి మండలాల్లో ఏపీఐఐసీ ఆధీనంలో వున్న భూములను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించేందుకు ఆయా ప్రాంతాల్లో శరవేగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
ఏపీఐఐసీ ఆధీనంలో వేలాది ఎకరాలు
ఐదేళ్లపాటు ఖాళీగా ఉంచేసిన వైసీపీ పాలకులు
విపరీతంగా పెరిగిపోయిన తుప్పలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక
తుప్పలు తొలగించి మౌలిక వసతుల కల్పన
పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయింపు
ఐదేళ్లలో రూ.3.98 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
లక్షమందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, సుస్థిరత ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర-2047పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం, రైలు, రోడ్డు రవాణా మార్గాలు అందుబాటులో ఉండడంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి, అనకాపల్లి, నక్కపల్లి మండలాల్లో ఏపీఐఐసీ ఆధీనంలో వున్న భూములను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించేందుకు ఆయా ప్రాంతాల్లో శరవేగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటు కోసం గతంలో ఏపీఐఐసీ సేకరించిన భూములను గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు వృథాగా వుంచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇటువంటి భూములను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయకృష్ణన్ నేతృత్వంలో ఏపీఐఐసీ భూముల అభివృద్ధితో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. అచ్యుతాపురం సెజ్ పరిధిలోని రాంబిల్లి క్లస్టర్, అనకాపల్లి మండలం కోడూరు, సిరసపల్లి, వల్లూరుల్లో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహికులకు ప్లాట్లుగా కేటాయిస్తున్నారు. పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
వల్లూరులో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు
పారిశ్రామిక పార్కు కోసం అనకాపల్లి మండలం వల్లూరులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 350 ఎకరాలను సేకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల ఏర్పాటుకు కనీసం చర్యలు చేపట్టలేదు. దాదాపు ఐదేళ్లపాటు భూములు వృథాగా పడివుండడమే కాకుండా తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఈ భూములను మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు కేటాయించింది. లాజిస్టిక్ పార్కు ఏర్పాటు కోసం ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఇటీవల వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈ భూముల్లో విపరీతంగా పెరిగిపోయిన తుప్పలను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల (నీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీలు) పనులు చేపడుతున్నారు. లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే వందలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. అనకాపల్లి మండలం కోడూరు సెజ్‌లో నేషనల్ ఫార్మా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నైఫర్) ఏర్పాటుకు భూ కేటాయింపులు జరిపారు. ఆయా సంస్థలు త్వరలోనే పనులు ప్రారంభించనున్నాయి.
అచ్యుతాపురం సెజ్‌కు క్యూ కడుతున్న పరిశ్రమలు
అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని రాంబిల్లి క్లస్టర్‌లో ఏపీఐఐసీ ఆధీనంలో 2,500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వైసీపీ హయాంలో ఖాళీగా వున్న ఈ భూముల అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం రూ.8 కోట్లు కేటాయించింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రాంబిల్లిలో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.లక్ష 85 వేల కోట్లతో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సరిహద్దులో గ్రీన్ హైడ్రోజన్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.145 కోట్లతో గ్యాస్ ఉత్పత్తి పరిశ్రమ రానున్నది. డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రూ.1,100 కోట్లు, అలియన్స్ టైర్స్ రూ.750 కోట్లు, మెగా ఫ్రూట్ ప్రొక్యూరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.185 కోట్లు, గోదావరి ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులు భూ కేటాయింపుల కోసం చేసుకున్న దరఖాస్తులను ఏపీఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు.
నక్కపల్లి కారిడార్‌లో స్టీల్‌ప్లాంట్, బల్క్‌డ్రగ్ పార్కు
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలంలో గతంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారికి అతి చేరువలో వుండడం, కాకినాడ, విశాఖ పోర్టులకు సమీపంలో ఉండడంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ముందుకు వచ్చాయి. తొలిదశలో రూ.69,035 కోట్ల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ఫ్యాక్టరీ కోసం నక్కపల్లి సెజ్‌లో 2,200 ఎకరాలు కేటాయించారు. తొలిదశ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇదే మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కానున్నది. ఇంకా మరికొన్ని కంపెనీలు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ఐదేళ్లలో రూ.3.98 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
- జి.నాగరాజారావు, జీఎం, జిల్లా పరిశ్రమల కేంద్రం
రానున్న ఐదేళ్లలో జిల్లాలో రూ.3.98 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా భూముల కేటాయింపు కోసం పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు చేసుకున్న దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలో ఏపీఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు.