Share News

Secretariat: రేషనలైజేషన్‌ షురూ

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:20 AM

సచివాలయ సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం హేతుబద్దీకరణ చేపట్టింది.ఇందులో భాగంగా సచివాలయాలను క్లస్టర్లుగా విభజించే కార్యక్రమం పూర్తయ్యింది.

Secretariat: రేషనలైజేషన్‌ షురూ
సచివాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం హేతుబద్దీకరణ చేపట్టింది.ఇందులో భాగంగా సచివాలయాలను క్లస్టర్లుగా విభజించే కార్యక్రమం పూర్తయ్యింది. సంబంధిత విధివిధానాలు తయారుచేయాలని సచివాలయ పాలన విభాగానికి, మండలపరిషత్‌లకు ప్రభు త్వం ఆదేశాలు జారీచేయగా, అధికారులు వారం క్రితం పూర్తిచేశారు. దీంతో జిల్లా యంత్రాంగం క్లస్టర్ల విభజన ప్రారంభించి కసరత్తుచేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. మిగులు ఉద్యోగులు 600 నుంచి 700 మంది ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు.

విభాగాలుగా సిబ్బంది

గ్రామ సచివాలయాల్లో 11 మంది, పట్టణాల్లో 9 మంది చొప్పున సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం వీరిని పలు విభాగాలుగా విభజించారు.

బహుళార్థక విభాగంలో నాలుగు కేటగిరీల ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ఉంటారు. వీరు సర్వేలు చేపడతారు. ఇతర సేవలను క్లస్టర్‌ స్థాయిలో అందిస్తారు.

సాంకేతికత విభాగంలో వ్యవసాయ, సెరికల్చర్‌, ఉద్యాన, ఇంజనీరింగ్‌, ఆరోగ్య, పశు సంవర్ధక, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ సహాయకులు ఉంటారు.

ఐటీలో ప్రవేశమున్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులను గుర్తించి ఇన్ఫర్మేషన్‌ విభాగంలో చేర్చుకున్నారు. వీరిని ఐటీ అవసరాలకు వినియోగించనున్నారు.

రెవెన్యూ విభాగంలో వీఆర్వోలు, సర్వేయర్లు ఉంటారు.మహిళా పోలీసులను ఐసీడీఎస్‌ విభాగంలో లేదా పోలీసుస్టేషన్లలో నియమించనున్నారు.అయితే పలువురు పోలీసుస్టేషన్లలో విధులు నిర్వహించడానికి సుముఖత చూపడం లేదు.

ఎంపీడీవోల ఆధ్వర్యంలో...

ప్రతి మండలంలో పక్కపక్కన ఉన్న సచివాలయాలను క్లస్టర్లుగా పరిగణిస్తారు. సచివాలయాలు సరిసంఖ్యలో ఉంటే సగం క్లస్టర్లు ఏర్పాటవుతాయి. ఉదాహరణకు 12 సచివాలయాలుంటే ప్రతి క్లస్టర్‌లో ఆరేసి సచివాలయాలను ఏర్పాటుచేస్తారు. బేసి సంఖ్యలో ఉంటే ఒక క్టస్లర్‌ పరిధిలోకి రెండు సచివాలయాలను తీసుకొస్తారు. బహుళార్ధక విభాగంలో జనాభా ప్రాతిపదికన , సాంకేతిక విభాగంలో క్లస్టరు పరిధిలో ఉద్యోగులను గుర్తిస్తారు. వీరు రెండేసి సచివాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. క్లస్టర్ల విభజన పనిని ఎంపీడీవోలు పూర్తిచేశారు. 2500 జనాభా వున్న చోట ఆరుగురు, 2501 నుంచి 3500 మంది ఉన్న చోట్ల ఎనిమిది మంది, ఆపై జనాభా ఉన్న సచివాలయాల పరిధిలో 10మంది సిబ్బందిని నియమించే విధంగా నివేదికలు తయారుచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న 4432 మంది సిబ్బందిలో సుమారు 600- 700 మధ్య సిబ్బందిని మిగులు ఉద్యోగులుగా గుర్తించారు.వీరిని ఏయే శాఖల్లో నియమించాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచీ మార్గదర్శకాలు విడుదల కాలేదని గ్రామ సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌, డీఎల్పీవో రవికుమార్‌ గురువారం రాత్రి ఆంధ్రజ్యోతికి తెలిపారు.


సంగ్రహ ంగా..

సచివాలయాలు : 612

ప్రతిపాదిత క్లస్టర్లు : 310

ఉద్యోగులు : 4432

మిగులు ఉద్యోగులు : 600 - 700 మధ్య

Updated Date - Apr 11 , 2025 | 01:20 AM