Share News

ఇంటర్‌ ఫలితాలు మెరుగు

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:31 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.

ఇంటర్‌ ఫలితాలు మెరుగు

  • ఫస్టియర్‌లో 79%, సెకండియర్‌లో 87% ఉత్తీర్ణత

  • గడిచిన ఏడాదితో పోల్చితే ప్రథమ సంవత్సరం 2 శాతం, ద్వితీయ సంవత్సరం 3 శాతం మెరుగుదల

  • రాష్ట్ర స్థాయిలో 4, 6 స్థానాల్లో విశాఖ జిల్లా

  • ఫలితాల్లో ప్రైవేటు కళాశాలల జోరు

మద్దిలపాలెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణతా శాతం ప్రథమ సంవత్సరంలో రెండు శాతం, ద్వితీయ సంవత్సరంలో మూడు శాతం పెరిగింది. ప్రథమ సంవత్సరం 40,098 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 31,866 మంది (79 శాతం), ద్వితీయ సంవత్సరం 36,479 మందికి 31,761 మంది (87 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో విశాఖ జిల్లా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నాలుగు, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది సీనియర్‌ ఇంటర్‌కు వచ్చేసరికి రెండు స్థానాలు దిగజారింది. గత ఏడాది ప్రథమ సంవత్సరం పరీక్షలు 38,818 మంది రాయగా 30,050 (77 శాతం), ద్వితీయ సంవత్సరం 34,672 మందికి 29,258 మంది (84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2023లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో సంవత్సరంలో 70 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 174 జూనియర్‌ కళాశాలలు (రెసిడెన్షియల్‌, హైస్కూలు ప్లస్‌, కేజీబీవీలు, ప్రైవేటు కళాశాలలు కలిపి) ఉన్నాయి. వాటిలో 147 ప్రైవేటు విద్యా సంస్థలు ఫలితాల సాధనలో ముందంజలో ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 35,897 మంది పరీక్షలు రాయగా 28,778 మంది (80.16 శాతం), ద్వితీయ ఏడాది 32,267 మందికి 27,944 మంది (86.6 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫలితాలకు సంబంధించి బాలురు, బాలికల వివరాలు విడుదలలో ఇంటర్‌ బోర్డు అధికారులు విఫలమయ్యారు.

ఒకకేషనల్‌ ఫలితాలు

ఒకేషనల్‌ గ్రూపు పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలోని 17 కళాశాలల నుంచి 2,820 మంది పరీక్షలు రాయగా 2,086 మంది (74 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం 69 శాతం, రెండో సంవత్సరం 79.25 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ప్రథమ సంవత్సరంలో 68 శాతం, రెండో సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఒకేషనల్‌ ఫలితాలు కాస్త అటుఇటుగా నమోదయ్యాయి.

కార్పొరేట్‌ కళాశాలదే పైచేయి

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మార్కులపరంగా కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులు ముందువరుసలో నిలిచారు. ఎంపీసీలో శ్రీచైతన్య విద్యార్థులు కూర్మదాసు శ్రీజ (కూర్మన్మపాలెం) 1000కి 992 మార్కులు, ఆకెళ్ల మేఘనాశర్మ 991 మార్కులు, శంబంగి మనస్విని 991, పి.మహేంద్ర 990 మార్కులు తెచ్చుకున్నారు. బైపీసీలో కె.జ్వలిత 990 మార్కులు సాధించింది. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు భోగి శ్రీకర్‌ 470కి 466, బి.భావనికృతి 466, కె.నైనిష 466 మార్కులు, బైపీసీలో కె.మేఘన, కె.మధురిమ, వెంకటసాయి శ్రీకర్‌, ఎం.ముస్కన్‌, ఎంవీ కీర్తన, పి.యామిని, ఎస్‌.దీపిక, ఎం.భార్గవి 435 మార్కులు సాధించారు.

జిల్లాలో గత నాలుగేళ్లలో ఇంటర్‌ ఫలితాలు

సంవత్సరం ప్రథమ ద్వితీయ ఏడాది

2021-22 59% 65%

2022-23 63% 70%

2023-24 77% 84%

2024-25 79% 87%

ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలలు ఫెయిల్‌

  • రాష్ట్ర స్థాయిలో అట్టడుగున విశాఖ జిల్లా

  • ప్రథమ సంవత్సరం 34.17 శాతం, ద్వితీయ సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత

  • తీరుమారని ‘హైస్కూల్‌ ప్లస్‌’

  • కొమ్మాది గిరిజన సంక్షేమ కళాశాలలో 98.73 శాతం ఉత్తీర్ణత

  • కేజీబీవీల్లో 63.82 శాతం, బీసీ సంక్షేమ కళాశాలల్లో 88.04,

  • సాంఘిక సంక్షేమ శాఖలో 70.96 శాతం పాస్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు పేలవమైన పనితీరు కనబరచాయి. ప్రథమ సంవత్సరం 34.17 శాతం, ద్వితీయ సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా రాష్ట్రంలో చివరి స్థానం (26)లో నిలిచింది. తొమ్మిది జనరల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ ఏడాది 1,539 మందికి 526 (34.17 శాతం), ద్వితీయ ఏడాది 1,260 మందికి 687 మంది (55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఏడాదికి సంబంధించి వీఎస్‌ కృష్ణా జూనియర్‌ కళాశాలలో ఉత్తీర్ణత మరీ దారుణంగా ఉంది. ఆ కళాశాలలో 481 మందికి కేవలం 79 మంది (16.42 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మల్కాపురం కళాశాలలో 23 మందికి నలుగురు (17.39 శాతం), ఇస్లాంపేటలో 40 మందికి తొమ్మిది మంది (22.5 శాతం), పెందుర్తిలో 144కి 46 (32 శాతం), మధురవాడలో 116 మందికి 33 మంది (28.45 శాతం), భీమిలిలో 139 మందికి 47 మంది (33.8 శాతం), అగనంపూడిలో 129 మందికి 56 మంది (43.41 శాతం), ఆనందపురంలో 12 మందికి ఆరుగురు (50 శాతం), నగరంలోని మహిళా జూనియర్‌ కళాశాలలో 455 మందికి 246 మంది (54.07) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం...ఆనందపురంలో ఎనిమిది మందికి ఇద్దరు (25 శాతం), ఇస్లాంపేటలో 37 మందికి 13 మంది (33 శాతం), మల్కాపురంలో 27 మందికి పది మంది (37.04 శాతం), కృష్ణా జూనియర్‌ కళాశాలలో 377కి 155 మంది (41.11 శాతం), పెందుర్తిలో 163 మందికి 73 మంది (44.79 శాతం), మధురవాడలో 64 మందికి 32 మంది (50 శాతం), భీమిలిలో 109 మందికి 65 మంది (59.3 శాతం), అగనంపూడిలో 87 మందికి 59 మంది (68 శాతం), మహిళా జూనియర్‌ కళాశాలలో 388 మందికి 278 మంది (71.65 శాతం) మంది పాసయ్యారు.

ఒకేషనల్‌లో...

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒకేషనల్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సరం 951 మందికి 665 మంది (69.9 శాతం), ద్వితీయ సంవత్సరం 918 మందికి 745 మంది (81.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీఎస్‌ కృష్ణా ఒకేషనల్‌ కళాశాలలో ప్రథమ ఏడాది 296 మందికి 167 మంది (56.4శాతం), ద్వితీయ ఏడాది 305 మందికి 217 మంది (71.15 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

‘హైస్కూల్‌ ప్లస్‌’ తీరు మారలేదు

జిల్లాలోని ఆరు ఉన్నత పాఠశాలల్లో (హైస్కూలు ప్లస్‌) ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తొలి నుంచి హైస్కూలు ప్లస్‌లు ఫలితాల సాధనలో విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం 167 మందికి 25 మంది (14.97 శాతం), ద్వితీయ సంవత్సరం 111 మందికి 22 మంది (19.81 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

గిరిజన సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థులు ప్రతిభ

కొమ్మాదిలో గల గిరిజన సంక్షేమ శాఖ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ప్రథమ ఏడాది 79 మందికి 78 మంది (98.73 శాతం), ద్వితీయ ఏడాది 81 మందికి 78 మంది (96.29 శాతం) మంది పాసయ్యారు. జిల్లాలో మూడు సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 155 మందికి 110మంది (70.96 శాతం), ద్వితీయ సంవత్సరం 173 మందికి 135 మంది (78.03 శాతం), సింహాయలం బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలలో ప్రథమ ఏడాది 92కి 81 మంది (88.04 శాతం), ద్వితీయ ఏడాది 79కి 74 మంది (93.67శాతం), నగరంలో ఉన్న ఏకైక ఎయిడెడ్‌ కళాశాలలో ప్రథమ ఏడాది 294కి 202 మంది (68.7శాతం), ద్వితీయ ఏడాది 250కి 180 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని మూడు కేజీబీవీల్లో ప్రథమ ఏడాది 94 మందికి 60 మంది (63.82 శాతం), ద్వితీయ ఏడాదిలో 90కి 53 మంది (58.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Updated Date - Apr 13 , 2025 | 01:31 AM