Share News

ఖాకీ వసూల్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:11 AM

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అంటే ఇంతవరకూ భయంతో ఉన్న పోలీసులు...క్రమంగా జూలు విదుల్చుతున్నారు.

ఖాకీ వసూల్‌

  • మద్యం దుకాణాలు, బార్ల నుంచి నెలవారీ మామూళ్లు

  • వైన్‌షాప్‌నకు రూ.5వేలు నుంచి రూ.8వేలు

  • బార్‌కు రూ.7,500 నుంచి రూ.పది వేలు

  • దాదాపు అన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ ఇదే తంతు

  • పోలీస్‌ శాఖలో ప్రత్యేక విభాగానికి రూ.2,000

  • సీపీకి దృష్టికి వెళ్లకుండా మేనేజ్‌ చేస్తున్న మధ్యస్థాయి అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అంటే ఇంతవరకూ భయంతో ఉన్న పోలీసులు...క్రమంగా జూలు విదుల్చుతున్నారు. గతంలో మాదిరిగా స్టేషన్‌ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, స్ర్కాప్‌ దుకాణాలు, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల నుంచి మామూళ్ల వసూళ్లపై దృష్టిసారించారు. ఇప్పటికే స్ర్కాప్‌ దుకాణాల నుంచి క్రైమ్‌ విభాగం పోలీసులు మామూళ్లు గుంజుతుండగా, బార్లు, మద్యం దుకాణాల నుంచి నెలవారీ వసూళ్లకు శాంతి భద్రతల విభాగం పోలీసులు గత నెలలో శ్రీకారం చుట్టారు. బార్‌కు ఇంత...వైన్‌షాప్‌కు ఇంత...అంటూ దుకాణం ఉన్న ప్రాంతాన్ని బట్టి రేట్లు నిర్ణయించారు. ఈ విషయం సీపీ దృష్టికి చేరకుండా మధ్యస్థాయి అధికారులు కొందరు కప్పిపుచ్చుతున్నారు.

సీపీ శంఖబ్రతబాగ్చికి ముక్కుసూటి అధికారిగా గుర్తింపు ఉండడంతో ఆయన రాకముందు నగరంలో పోస్టింగ్‌ కోసం ఆసక్తి చూపినవారంతా వెనకడుగు వేసి రేంజ్‌లోనే ఉండిపోయారు. నగరంలో పనిచేస్తున్న అధికారులు కూడా ఏ క్షణంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనాల్సి వస్తుందోననే భయంతో నగరం నుంచి రేంజ్‌కు వెళ్లిపోయారు. సీపీ కూడా సిబ్బంది, అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, అవినీతికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పోలీస్‌ కమిషనరేట్‌లో కొంతమంది మధ్య స్థాయి అధికారులు రాజకీయ పలుకుబడితో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అండదండలు తమకు పుష్కలంగా ఉన్నాయంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బంది దగ్గర గొప్పగా చెప్పుకుంటూ పరోక్షంగా వసూళ్లకు వారిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ముందుగా ట్రాఫిక్‌ విభాగంలో కొందరు అధికారులు ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలు, వ్యాపారులతో, తర్వాత క్రైమ్‌ విభాగంలోని కొందరు అధికారులు స్ర్కాప్‌ వ్యాపారులతో అవగాహన కుదుర్చుకున్నట్టు పోలీస్‌ శాఖలో ప్రచారం జరుగుతోంది. తాజాగా శాంతి భద్రతల విభాగం పోలీసులు కూడా వసూళ్లపై దృష్టిసారించారని, అందులో భాగంగానే మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి నెలవారీ మామూళ్లు పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 142 మద్యం దుకాణాలు, 117 బార్‌లు ఉన్నాయి. గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు నెలవారీ మామూళ్లు అందేవి. జనరల్‌ కానిస్టేబుల్‌ వాటిని వసూలుచేసి స్టేషన్‌ అధికారికి అందజేసేవారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడంతో మామూళ్లు నిలిచిపోయాయి. కేవలం బార్‌ల నుంచి మాత్రమే నెలవారీ మామూళ్లు కొనసాగేవి. సీపీగా శంఖబ్రతబాగ్చి బాధ్యతలు చేపట్టిన తర్వాత బార్‌ల నుంచి కూడా మామూళ్లను పోలీసులు నిలిపివేశారు. అయితే నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఇటీవల పోస్టింగ్‌లు పొందిన కొంతమంది మధ్యస్థాయి అధికారులు...మద్యం వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తిరిగి ప్రారంభించాలని తమ కిందిస్థాయిలోని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. ఎక్కడైనా బయటకు వచ్చినా దానిని సీపీ దృష్టికి చేరకుండా తమ స్థాయిలోనే ఏదో ఒకటి చెప్పి సర్దుబాటు చేస్తామని భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో గతనెల నుంచి దాదాపు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి నెలవారీ వసూళ్ల ప్రక్రియ ప్రారంభించేశారు.

మద్యం దుకాణానికి రూ.5 వేల నుంచి రూ.ఎనిమిది వేలు

ప్రతి మద్యం దుకాణం వద్దకు సంబంధిత సీఐలు కొన్నాళ్ల కిందట పెట్రోలింగ్‌ పేరుతో ప్రత్యక్షంగా వెళ్లారు. దుకాణాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎదురయ్యే ఇబ్బందులను వారికి వివరించారు. తర్వాత సిండికేట్‌ల ద్వారా వ్యాపారులు సంప్రతింపులు చేసి నెలవారీ మామూళ్లపై అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు. దుకాణంలో విక్రయాల స్థాయిని బట్టి నెలకు రూ.ఐదు వేల నుంచి రూ.ఎనిమిది వేల వరకు నెలవారీ మామూళ్లు నిర్ణయించారు. అలాగే బార్‌ల వద్ద రౌడీషీటర్లు, ఆకతాయిలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వ్యాపారులను బెదిరించి వారి నుంచి నెలకు రూ.7,500 నుంచి రూ.పది వేల వరకు మామూళ్లు తీసుకుంటున్నారు. కొన్ని దుకాణాల్లో వ్యాపారం ఆశాజనకంగా లేనప్పటికీ పోలీసులతో తలనొప్పి ఎందుకనే భావనతో అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇదికాకుండా నగరంలో ఎక్కడైనా దాడులు నిర్వహించే అధికారం కలిగిన ప్రత్యేక విభాగం మద్యం దుకాణం నుంచి రూ.రెండు వేలు, బార్‌ నుంచి రూ.ఐదు వేలు చొప్పున వసూలు చేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై పోలీస్‌ శాఖలోని మధ్యస్థాయి అధికారులకు పూర్తిసమాచారం ఉన్నప్పటికీ తమకు వాటాలు వస్తుండడంతో ఈ విషయాన్ని సీపీ దృష్టికి చేరకుండా చూస్తున్నారంటున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 01:11 AM