Share News

ఇంటర్‌ ఫలితాల్లో వెనుకంజ

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:06 AM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరుత్సాహపరిచాయి. గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడినా రాష్ట్ర స్థాయిలో మాత్రం వెనుకబడింది. శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత అంతంతమాత్రంగానే ఉంది.

ఇంటర్‌ ఫలితాల్లో వెనుకంజ

- ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లాకు 17.. సెకండియర్‌లో 25వ స్థానం

- ప్రథమ సంవత్సరంలో 63... ద్వితీయ సంవత్సరంలో 73 శాతం ఉత్తీర్ణత

-

అనకాపల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరుత్సాహపరిచాయి. గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడినా రాష్ట్ర స్థాయిలో మాత్రం వెనుకబడింది. శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత అంతంతమాత్రంగానే ఉంది.

జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 10,279 మంది పరీక్షలు రాయగా, 6,437 మంది (62.62 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9,512 మందికి 6,942 మంది (72.98 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 62.62 శాతం, గత ఏడాది సెకండియర్‌లో 66 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 72.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా చివరి వరుసలో ఉండడం గమనార్హం. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, ప్రథమ సంవత్సరంలో 43.74 శాతం, ద్వితీయ సంవత్సరంలో 60.73 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రథమ సంవత్సరంలో కేవలం 36.66 శాతం మాత్రమే నమోదైంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 458 మందికి 392 మంది (85.58 శాతం), ద్వితీయ సంవత్సరంలో 397కి 360 మంది (90.68 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బీసీ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత ప్రైవేటు కళాశాలల కంటే మెరుగ్గానే ఉంది. ప్రథమ సంవత్సరంలో 95.36 శాతం, ద్వితీయ సంవత్సరంలో 95.48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 2,174కి 1,217 మంది (55.97 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,128కి 1,429 మంది (67.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Updated Date - Apr 13 , 2025 | 01:06 AM