మెడికిల్ స్టోర్స్
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:32 AM
ఉమ్మడి జిల్లాలో కాలం చెల్లిన మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు
అధికారుల తనిఖీల్లో బయటపడిన కాలం చెల్లిన మందులు
ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొందరు నిర్వాహకులు
ఔషధ నియంత్రణ మండలి పర్యవేక్షణ కొరవడడమే కారణం
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో కాలం చెల్లిన మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఔషధ నియంత్రణ విభాగం అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి శ్రుతిమించుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అనేక మందుల దుకాణాల నిర్వా హకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగిస్తున్నారు. స్టోర్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు వాటిని పర్యవేక్షించాల్సిన ఔషధ నియంత్రణ విభాగం అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో నిర్వా హకులు రెచ్చిపోతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఎలాంటి మందులను విక్రయించకూడదన్నది నిబంధన. కానీ దీనిని పట్టించుకునే దుకాణాల నిర్వాహకులు లేరు. కొద్దిరోజుల కిందట విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్, ఈగల్ టీమ్, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నగర పరిధిలోని 16 మందుల దుకాణాల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. రెండు మెడికల్ స్టోర్స్‌లో గడువు ముగిసిన మందులను గుర్తించారు. వీటిలో ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్ స్టోర్స్‌లో సుమారు రూ.50 వేల విలువజేసే మందుల గడువు తీరినట్టు గుర్తించారు. గాజువాకలోని ఎస్‌ఎస్‌వీ మెడికల్ స్టోర్స్‌లో రూ.90 వేలు విలువ జేసే మందులను గుర్తించి, వాటిని సీజ్ చేసిన అనంతరం లైసెన్సులు రద్దు చేశారు. అలాగే మరో ఏడు దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నట్టు గుర్తిం చారు. ఆయా దుకాణాలపై 15 నుంచి 30 రోజుల సస్పెన్షన్ విధించారు.
కానరాని ప్రిస్కిప్షన్ రిజిస్టర్లు
మెడికల్ స్టోర్స్‌లో విక్రయించే మందులకు సంబంధించి ప్రిస్కిప్షన్ రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన వైద్యుడి ప్రిస్కిప్షన్ మేరకు మాత్రమే మందులను విక్రయించాలి. వాటిని ఎవరికి విక్రయించినదీ, వైద్యుడి ప్రిస్కిప్షన్ వివరాలతో తప్పనిసరిగా మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు రిజిస్టర్ నిర్వహించి భద్రపరచాలి. హోల్ సేలర్స్ వద్ద ఎన్ని మందులు కొనుగోలు చేసిందీ, ఎంతకు విక్రయించిందీ, మిగిలిన సరకు వివరాల రికార్డులను నిర్వహించాలని చట్టం చెబుతోంది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆరు మెడికల్ స్టోర్స్‌లో ఈ రికార్డులు లేవని తేలింది. కొన్నిచోట్ల రికార్డులున్నప్పటికీ పూర్తిస్థాయిలో వివరాలు కనిపించలేదు.
అదుపులేని మత్తు మందుల విక్రయాలు
కొన్ని మెడికల్ స్టోర్స్‌లో మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలు భారీగా విక్రయిస్తున్నారు. వీటిని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెస్తున్నట్టు చెబుతున్నారు.
కానరాని పర్యవేక్షణ
ఔషధ నియంత్రణ విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ మెడికల్ స్టోర్స్‌ను పర్యవేక్షించాలి. అటువంటిదేమీ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టుగా మందుల విక్రయాలు సాగిస్తున్నారు. గడువు ముగిసిన మందులను వినియోగించడంతో తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. నగర పరిధిలో 3 వేలు, అనకాపల్లి జిల్లాలో 1,100, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300 మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు విశాఖ జిల్లాలో ముగ్గురు, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు మరో ముగ్గురు మాత్రమే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరంతా ప్రతినెలా 40 వరకు దుకాణాలను తనిఖీ చేయాలి. ఒకరిద్దరు మినహా తూతూమంత్రంగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. వీరిని కో-ఆర్డినేట్ చేయాల్సిన జిల్లాస్థాయి అధికారి పట్టనట్టు వ్యవహరిస్తుండడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. ఈ విభాగం పనితీరుపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.