Share News

మిట్టల్‌ స్టీల్‌ మరో అడుగు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:43 AM

పారిశ్రామిక హబ్‌గా జిల్లా అభివృద్ధి చెందబోతున్నది. దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి పరిసరాల్లో పరిశ్రమల స్థాపనకు క్యూ కడుతున్నారు. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లక్ష 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది.

మిట్టల్‌ స్టీల్‌ మరో అడుగు
మిట్టల్‌ స్టీల్‌ ప్రతినిధులతో నక్కపల్లి సెజ్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌ (ఫైల్‌ ఫొటో)

తొలిదశ పనులకు ప్రభుత్వం పచ్చజెండా

పెట్టుబడి.. రూ.55,964 కోట్లు

ఉత్పత్తి.. 7.3 మిలియన్‌ టన్నులు

2029నాటికి ఉత్పత్తి ప్రారంభం

డీఎల్‌ పురంలో క్యాప్టివ్‌ పోర్టు ఏర్పాటుకు ఆమోదం

రెండు దశల్లో రూ.11,196 కోట్లతో నిర్మాణం

హ్యాండ్లింగ్‌ సామర్థ్యం 31 మిలియన్‌ టన్నులు

2029 జనవరి నాటికి అందుబాటులోకి రానున్న పోర్టు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పారిశ్రామిక హబ్‌గా జిల్లా అభివృద్ధి చెందబోతున్నది. దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి పరిసరాల్లో పరిశ్రమల స్థాపనకు క్యూ కడుతున్నారు. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లక్ష 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మిస్తారు. 2029 జనవరినాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనిలో 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండో దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పుతారు. దీనిలో 2033 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారు. రెండో దశలో 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

డీఎల్‌ పురంలో క్యాప్టివ్‌ పోర్టు

అనకాపల్లి/ నక్కపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మిట్టల్‌ స్టీల్‌ ఇండియా కంపెనీ ప్రతినిధుల అభ్యర్థన మేరకు డీఎల్‌ పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్‌ ఫ్రంట్‌తో క్యాప్టివ్‌ పోర్టు (స్టీల్‌ ప్లాంట్‌ సొంత అవసరాలకు) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనికి అనుమతుల కోసం కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు సంబంఽధించి రాయితీ ఒప్పందంలోని క్లాజ్‌ నంబరు 30.1.1ను (ఇండియన్‌ పోర్టు యాక్ట్‌-1908) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. తొలుత రూ.5,816 కోట్ల అంచనా వ్యయంతో ఏటా 20.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇది 2029నాటికి అందుబాటులోకి (స్టీల్‌ ప్లాంట్‌ మొదటి దశలో ఉత్పత్తి మొదలయ్యేనాటికి) తెస్తారు. ఇక్కడ వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో దశలో రూ.5,380 కోట్ల వ్యయంతో ఏటా 10.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో పోర్టును విస్తరిస్తారు. దీని ద్వారా మరో 5 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

Updated Date - Apr 04 , 2025 | 12:43 AM