Share News

ఇంటర్‌లో మిశ్రమ ఫలితాలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:39 PM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి సంవత్సరం ఫలితాలు నిరాశాజనకంగా ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి.

ఇంటర్‌లో మిశ్రమ ఫలితాలు
సిమ్మల చాయాదేవి, సెకెండ్‌ బైపీసీ 963 టీడబ్ల్యూ జూనియర్‌ కళాశాల, యండపల్లివలస

ఫస్టియర్‌ నిరాశాజనకం.. సెకండియర్‌ ఆశాజనకం

ప్రథమ సంవత్సరంలో 56 శాతం,

ద్వితీయ సంవత్సరంలో 73 శాతం పాస్‌

పర్యవేక్షణ లేక ఫలితాలు బోల్తా

సౌకర్యాలు, సిబ్బంది, అధ్యాపకులు అంతంతమాత్రమే

పాడేరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి సంవత్సరం ఫలితాలు నిరాశాజనకంగా ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 56 శాతం, రెండో సంవత్సరంలో 73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 5,190 మంది విద్యార్థులకుగానూ 3,786 మంది ఉత్తీర్ణత సాధించి 56 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 5,645 మంది విద్యార్థులకు 3,153 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ద్వితీయ సంవత్సరం 73 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

జిల్లాలో మెరుగు పడని ఇంటర్‌ విద్య

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఏజెన్సీలోని ఇంటర్‌ విద్యావ్యవస్థ మెరుగు పడలేదనే విమర్శల వినిపిస్తున్నాయి. జిల్లా, రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఇంటర్‌ విద్యను పర్యవేక్షించే పరిస్థితి పూర్తిగా లేదు. అలాగే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సమస్యలు, ఇతర ఇబ్బందులను సైతం చెప్పుకోవడానికి జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు సైతం ఇక్కడ సంపూర్ణంగా లేరు. దీంతో గిరిజన ప్రాంతంలో ఇంటర్‌ విద్యావ్యవస్థ మెరుగుపడే అవకాశమే లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీలో అనేక జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ఆయా పనులు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు నిర్వహిస్తున్నారు. దీంతో వారంతా బోధనపై దృష్టి పెట్టలేని పరిస్థితి కొనసాగుతున్నది. ఉదాహరణకు ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో బోధనేతర సిబ్బంది ఒక్కరూ లేరు. ఇలా ఏజెన్సీలో వ్యాప్తంగా అనేక కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేని దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో ఏజెన్సీలో ఇంటర్‌లో చక్కని ఫలితాలు ఆశించడం తప్పే అవుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మన్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని పరిస్థితులను మెరుగుపర్చి గిరిజన విద్యార్థులకు చక్కని ఇంటర్‌ విద్యను అందించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

జూనియర్‌ కళాశాలల్లో టాప్‌ ముంచంగిపుట్టు

జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లోనూ ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ టాప్‌లో నిలిచింది. జిల్లాలో మొదటి సంవత్సరంలో అత్యధికంగా ముంచంగిపుట్టు కాలేజీలో 87 శాతం కాగా, అత్యల్పంగా వీఆర్‌పురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కేవలం 6 శాతం మాత్రమే పాస్‌ అయ్యారు. అలాగే రెండో ఏడాదిలో అత్యధికంగా ముంచంగిపుట్టు కాలేజీలో 95 శాతం కాగా, అత్యల్పంగా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 45 శాతం విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో ముంచంగిపుట్టులో 227కి 198మంది (87శాతం), ద్వితీయ సంవత్సరంలో 222కి 210 మంది (95శాతం) ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. కళాశాలల్లో ప్రథమ ఏడాదిలో గంగవరంలో 47మందికి ఐదుగురు (11శాతం), డుంబ్రిగుడలో 190కి 115మంది (60.5), కూనవరంలో 40కి 16మంది (40శాతం), అరకులోయలో 365కి 124 మంది (33.97 శాతం), పాడేరులో 302కి 184 మంది (60.92శాతం), అనంతగిరిలో 147కి 55 మంది(37.47శాతం), జి. మాడుగులలో 190కి 89 మంది(31శాతం), వీఆర్‌.పురంలో 49కి ముగ్గురు (ఆరు శాతం), దేవీపట్నంలో 44కి 21మంది(47శాతం), రంపచోడవరంలో 206కి 61 మంది (30 శాతం), రామవరంలో 57కి 28మంది (49 శాతం), రాజవొమ్మింగిలో 136కి 69మంది (50శాతం), అడ్డతీగలలో 142కి 11 మంది (ఎనిమిది శాతం), నెల్లిపాకలో 12కి ఇద్దరు (16.6శాతం), మారేడుమిల్లిలో 94కి 56 మంది (60శాతం), హుకుంపేటలో 256కి 159 మంది(62శాతం), చింతపల్లిలో 353కి 274 మంది (78 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

సెకండియర్‌లో..

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం గంగవరంలో 45మందికి 24 మంది(53.30 శాతం), కూనవరంలో 44కి 34 మంది (75శాతం), అరకులోయలో 308కి 195 మంది (63.3 శాతం), డుంబ్రిగుడలో 185కి 172 మంది (92.4శాతం), పాడేరులో 388కి 296 (87.28 శాతం) మంది, అనంతగిరిలో 130కి 95మంది (73.07శాతం), జి.మాడుగులలో 280కి 105మంది (38శాతం), సీలేరులో 45కి 35మంది(77.77శాతం), వీఆర్‌.పురం 31కి ఏడుగురు(22.58శాతం), దేవిపట్నంలో 43కి 29మంది (67శాతం), రంపచోడవరంలో 216కి 98మంది(45శాతం), రామవరంలో 57కి 39మంది(68.42శాతం), రాజవొమ్మంగిలో 139కి 74మంది (68.42శాతం), అడ్డతీగలలో 102కి 57 మంది( 56శాతం),నెల్లిపాకలో 18కి తొమ్మిది( 16.6శాతం), మారేడుమిల్లిలో 77కి 51 మంది (66.2శాతం), హుకుంపేటలో216కి 187మంది( 86.57శాతం), చింతపల్లిలో 177కి 165 మంది (93 శాతం), ముంచంగిపుట్టులో 222కి 210 మంది (95శాతం)ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - Apr 12 , 2025 | 11:39 PM