Share News

పోలవరం ఎనిమిదో ప్యాకేజీ పనుల్లో కదలిక

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:06 AM

పోలవరం ఎడమ కాలువ ఎనిమిదో ప్యాకేజీకి భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి, ముగనపాక మండలాల్లో సుమారు 15.7 ఎకరాలను సేకరించనున్నారు.

పోలవరం ఎనిమిదో ప్యాకేజీ పనుల్లో కదలిక

అనకాపల్లి, మునగపాక మండలాల్లో 15.7 ఎకరాల సేకరణకు చర్యలు

పిసినికాడ నుంచి నాగులాపల్లి వరకు కాలువ తవ్వకం

పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు సాగునీరు

అనకాపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ కాలువ ఎనిమిదో ప్యాకేజీకి భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి, ముగనపాక మండలాల్లో సుమారు 15.7 ఎకరాలను సేకరించనున్నారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి జిల్లాలో పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు ఆరు, ఏడు ప్యాకేజీల కింద గతంలోనే పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి, మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇదిలావుండగా పోలవరం నీటిని విశాఖకు తరలించడానికి, ఇదే సమయంలో అనకాపల్లి, మునగపాక మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు నీరు అందించడానికి గత టీడీపీ హయాంలోనే తాళ్లపాలెం నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు ఎనిమిదో ప్యాకేజీగా ప్రకటించారు. ఇందులో భాగంగా తాళ్లపాలెం నుంచి అనకాపల్లి మండలం పిసినికాడ వరకు ఏలేరు కాలువను గతంలోనే విస్తరించారు. ఇక్కడ నుంచి కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు విస్తరించాల్సి వుంది. కాగా పోలవరం నీటిని అనకాపల్లి, ముగనపాక మండలాలకు అందించేందుకు పిసినికాడ వద్ద ఏలేరు కాలువ నుంచి రైల్వే ట్రాక్‌, జాతీయ రహదారి కిందగా తూర్పు వైపునకు మునగపాక మండలం నాగులాపల్లి వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలి. దీనివల్ల రెండు మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ కాలువ తవ్వకానికి అవసరమైన 15.7 ఎకరాలను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Mar 14 , 2025 | 01:06 AM