Share News

పవన్‌ కల్యాణ్‌ రాక రేపు

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:01 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం అల్లూరి జిల్లా అరకు లోయ పర్యటనకు వస్తున్నారని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్‌బాబు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ రాక రేపు

పెందుర్తి ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం అల్లూరి జిల్లా అరకు లోయ పర్యటనకు వస్తున్నారని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్‌బాబు తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి అరకులోయ వెళుతూ ఉదయం 8 గంటలకు పెందుర్తిలో ఆగనున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, కూటమి నేతలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలకాలని పంచకర్ల పిలుపునిచ్చారు.


కంబాలకొండపై కొత్తగా వ్యూపాయింట్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

కంబాలకొండపై 30 అడుగుల ఎత్తులో వ్యూపాయింట్‌ నిర్మించనున్నారు. క్యాంటీన్‌ వెనుక గల కొండపై వ్యూపాయింట్‌ నిర్మాణానికి రూ.35 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు. వ్యూపాయింట్‌ నుంచి తూర్పుగా చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒడిశాలో తీర ప్రాంతంలో కొండలపై రెండు, మూడుచోట్ల నిర్మించిన వ్యూపాయింట్లకు పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్కడ వ్యూ పాయింట్లు చూసిన అటవీ అధికారులు అదే డిజైన్‌తో కంబాలకొండలో నిర్మించాలని ప్రతిపాదించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు. కొత్తగా నిర్మించనున్న వ్యూపాయింట్‌కు వెళ్లేందుకు క్యాంటీన్‌ సమీపం నుంచి రహదారి ఏర్పాటుచేస్తారు. వచ్చే వర్షాకాలం నాటికి వ్యూపాయింట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని విశాఖపట్నం రేంజర్‌ పీవీ శాస్త్రి పేర్కొన్నారు.


14 అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం

ఈ నెలలోనే మత్స్యకార భరోసా పంపిణీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో చేపల వేటపై ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఉత్తర్వులు ఇచ్చింది. దాదాపు 61 రోజులు ఈ నిషేధం అమలులో ఉంటుంది. మళ్లీ జూన్‌ 15వ తేదీ నుంచి మత్స్యకారులను సముద్రంలో వేటకు అనుమతిస్తారు. ఈ నిషేధం సమయంలో బోట్లకు యంత్రాలు లేకుండా తెడ్ల సాయంతో చేపలు వేటాడేవారు తప్ప ఇంకెవరూ సముద్రంలోకి వెళ్లకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వెళ్లడానికి యత్నిస్తే మెరైన్‌ పోలీసులు చర్యలు చేపడతారు. మత్స్య శాఖ అధికారులు కూడా హార్బర్‌, జెట్టీలలో నిఘా పెడతారు. ఈ వేసవిలో చేపలు, రొయ్యలు సముద్రంలో తమ సంతతిని వృద్ధి చేస్తాయి. వాటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేంద్రం ఏటా ఈ నిషేధం అమలు చేస్తోంది.

మత్స్యకారులకు భృతి

మత్స్యకారులకు ఈ నిషేధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భృతి అందిస్తోంది. గత ఏడాది ఈ సీజన్‌లో ఎన్నికలు జరగడం వల్ల గుర్తించిన లబ్ధిదారులకు భృతి అందలేదు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాది ఇవ్వాల్సిన రూ.పది వేలు, ఈ ఏడాదికి సంబంధించిన రూ.10 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఒక్కో కుటుంబానికి ఇవ్వనున్నట్టు మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణరావు తెలిపారు. గత ఏడాది 9,500 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారికి ఈ నెలలోనే ఆ మొత్తం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ఇంకా చేపట్టాల్సి ఉందని వివరించారు.

Updated Date - Apr 06 , 2025 | 01:01 AM