మిర్చి రైతుకు తెగుళ్ల ఘాటు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:09 AM
మిర్చి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. మొక్క దశలో వున్నప్పుడే పలు రకాల తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణ కోసం మార్చిమార్చి మందులు పిచికారీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి వుండగా ఇందులో మూడో వంతు కూడా రాలేదు. మార్కెట్‌లు ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదని రైతులు వాపోతున్నారు.

పూత దశలోనే చీడపీడలు
మందులు పిచికారీ చేసినా నివారణకాని వైనం
నాలుగో వంతుకు పడిపోయిన మిర్చి దిగుబడి
పెట్టుబడులు సైతం రాని పరిస్థితి
కోటవురట్ల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మిర్చి రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. మొక్క దశలో వున్నప్పుడే పలు రకాల తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణ కోసం మార్చిమార్చి మందులు పిచికారీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి వుండగా ఇందులో మూడో వంతు కూడా రాలేదు. మార్కెట్‌లు ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో మిర్చి పంట సాగయ్యే మండలాల్లో కోటవురట్ల మొదటిస్థానంలో వుంది. మండలంలోని కైలాసపట్నం రాజుపేట, చౌడువాడ, గొట్టివాడ, కోటవురట్ల, కొడవటిపూడి, కె.వెంకటాపురం, లింగాపురం, తదితర గ్రామాల్లో బోర్లు కింద దాదాపు 200 ఎకరాల్లో మిర్చి పంటను పండిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఎకరాకు 15 క్వింటాళ్లమేర ఎండు మిర్చి దిగుబడి వస్తుంది. గత ఏడాది (2023-24) క్వింటా మిర్చి (నాణ్యత, రకాన్నిబట్టి) రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలికింది. దీంతో ఈ ఏడాది (2024-25) కొత్తగా పలువురు రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపారు. సాగుకు పొలాన్ని సిద్ధం చేయడం నుంచి విత్తనం, ఎరువులు, క్రిమి సంహారక మందులు, కాయ కోత, ఇతర కూలి ఖర్చులు కలుపుకుంటే ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చి, క్వింటా సగటున రూ.12 వేల ధర పలికితే.. ఖర్చులుపోను రూ.60-80 వేల వరకు మిగులుతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. నారు నాటిన తరువాత నెల రోజుల వరకు మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో మిర్చి కాపు ఆశాజకనంగా వుంటుందని రైతులు భావించారు. కానీ పూత దశలో ఒక్కసారిగా తెగుళ్లు దాడిచేశాయి. ముఖ్యంగా తెల్లదోమ ఆశించడంతో ఆకులు ముడుచుకుపోయి పూత సరిగా రాలేదు. వీటి నివారణకు ఎన్ని రకాల మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప తెగుళ్ల బెడద తొలగలేదు. దీంతో పెట్టుబడి పెరిగింది... దిగుబడి తగ్గింది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు మించి రాలేదని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.80 వేల వరకు పెట్టుబడికాగా, పండి పంటను (ఎండు మిర్చి) విక్రయిస్తే రూ.60 వేలు కూడా రాలేదని వాపోయారు.
పెట్టుబడి వస్తుందన్న ఆశ లేదు
కరెడ్ల నాగేశ్వరరావు, మిర్చి రైతు చౌడువాడ
నేను ఎకరా భూమిలో మిరప సాగు చేపట్టాను. ఇప్పటికే రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. గతంలో కంటే ఈ ఏడాది తెగుళ్లు అధికమయ్యాయి. వీటి నివారణ కోసం తరచూ మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీంతో ఖర్చులు పెరిగాయి. కానీ దిగుబడి బాగా తగ్గిపోయింది. మిర్చి ధర సైతం ఆశాజనకంగా లేదు. పెట్టుబడి వస్తుందన్న నమ్మకం కూడా లేదు.