Share News

మన్యంలో కుండపోత

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:36 PM

ఏజెన్సీలో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపు ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మన్యంలో కుండపోత
పాడేరు పీఎంఆర్‌సీ రోడ్డులో శుక్రవారం రాత్రి కురుస్తున్న వర్షం

ఉదయం నుంచి ఎండ తీవ్రత

సాయంత్రం కుండపోతగా వర్షం

అనంతగిరిలో మూడు గంటలకుపైగా కురిసిన వాన

ఉపశమనం పొందిన జనం

పాడేరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపు ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొంది. అలాగే పగటి పూట ఎండ సైతం తీవ్రంగానే కాసింది. కాని సాయంత్రం ఏడు గంటల తర్వాత వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాలతోపాటు ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. తాజా వాతావరణం చల్లగా ఉండడంతో జనం ఊరట చెందారు.

కొయ్యూరులో 37 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏజెన్సీలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతునే ఉన్నాయి. ఏజెన్సీలో శుక్రవారం కొయ్యూరులో 37.1 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా డుంబ్రిగుడలో 35.2, పెదబయలులో 33.6, హుకుంపేటలో 32.8, అరకులోయలో 32.3, జీకేవీధిలో 32.0, చింతపల్లిలో 31.9, అనంతగిరిలో 31.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అనంతగిరిలో భారీ వర్షం

అనంతగిరి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఐదు గంటలు అవుతుండగా వాతావరణంలో మార్పులు ఏర్పడి ఏకధాటిగా వర్షం కురిసింది. రాత్రి ఎనిమిది గంటలు దాటినా వర్షం కురుస్తునే ఉంది. వర్షపు నీరు రోడ్లపై పారింది. ఉదయం నుంచి ఎండ వేడిమిని తట్టుకోలేకపోయిన ప్రజలు వర్షానికి కొంతమేరకు ఉపశమనం పొందారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Updated Date - Apr 04 , 2025 | 10:36 PM