ఉక్కులో ‘ప్రి మెచ్యూర్ రిటైర్‌మెంట్’
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:12 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం అంతా తాను అనుకున్నట్టుగానే చేస్తోంది.

50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మూడు నెలల జీతం చేతిలో పెట్టి ఇంటికి పంపుతోన్న యాజమాన్యం
12వ తేదీ నుంచే ఉత్తర్వులు జారీ
‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ అంటూ కొత్త భాష్యం
గతంలో ఏదో ఒక సందర్భంలో షోకాజ్ అందుకున్నవారు, క్రమశిక్షణ చర్యలకు గురైనవారే టార్గెట్
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం అంతా తాను అనుకున్నట్టుగానే చేస్తోంది. ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా సుమారు 1,200 మందిని శాశ్వతంగా ఇంటికి పంపించేసిన యాజమాన్యం ఇప్పుడు ‘ప్రిమెచ్యూర్ రిటైర్‌మెంట్’ పేరుతో 50 ఏళ్లు దాటిన వారికి మూడు నెలల జీతం ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగిస్తోంది. ఈ తరహా ఉత్తర్వులు ఈ నెల 12వ తేదీ నుంచే ఉద్యోగులకు జారీచేస్తోంది. దీనికి గాను ఆయా ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని ‘ఇనెఫిషియెన్సీ’ ముద్ర వేస్తోంది. సంస్థ కాండక్ట్, డిసిప్లిన్ అండ్ అప్పీల్ నిబంధనలు క్లాస్ 4.0 (సి) ప్రకారం మూడు నెలల జీతం ఇచ్చి తొలగించే అధికారం ఉందని, ఉత్తర్వుల్లో పేర్కొంటోంది. ఇప్పటికే కొందరికి ఈ ఉత్తర్వులు అందాయి.
అనేక విమర్శలు
ప్రిమెచ్యూర్ రిటైర్‌మెంట్ విధానంపై అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడో తప్పు చేశారని, షోకాజ్ నోటీసులు అందుకున్న వారిని, క్రమశిక్షణ చర్యలకు గురైన వారిలో 50 ఏళ్లు దాటిన వారిని ఈ పద్దులో తీసేస్తున్నారు. దీనికి ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ అని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఉక్కు ఉత్పత్తి అనేది అంతా కలిసి చేసే పని. ఒక్కరు గట్టిగా పనిచేస్తేనో, చేయకపోతేనో ఆగిపోయేది కాదు. స్టీల్ ప్లాంటు ఉద్యోగుల తొలగింపునకు ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ అని పేర్కొనడాన్ని అధికారులు తప్పు పడుతున్నారు. పైగా ఎప్పుడో చేసిన తప్పులకు జీతాల్లో కోత వంటి శిక్ష అనుభవించిన వారిని మళ్లీ ఇప్పుడు ‘మీకు 50 ఏళ్లు వచ్చేశాయి...వెళ్లిపోండి’ అనడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నిస్తున్నారు. గతంలో రిటైర్‌మెంట్ వయస్సు 58 ఏళ్లుగా ఉండగా, ఉద్యోగుల అనుభవం అవసరమని నాటి ప్రధాని వాజపేయి రిటైర్‌మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచారని, ఇప్పుడు వారికి జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉందని, ఏకంగా పదేళ్లు తగ్గించేసి 50 ఏళ్లకే ఇంటికి పంపడం దారుణమని విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని కూడా ఇంటికి పంపించేయాలని చూస్తున్నారని పలువురు వాపోతున్నారు.
15 ప్లాంట్ 3: మినిట్స్ పత్రాలను చూపుతున్న ఆర్‌ఎల్‌సీ, ఉక్కు అధికారులు, కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు
కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె వాయిదా
రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు,
కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకుల మధ్య చర్చలు
మే 20 వరకూ కార్మికులెవరినీ తొలగించబోమన్న యాజమాన్యం
ఉక్కుటౌన్‌షిప్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె వాయిదా పడింది. బుధవారం రాత్రి నగరంలో ఆర్‌ఎల్‌సీ (రీజినల్ లేబర్ కమిషనర్) మొహంతి సమక్షంలో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు, కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించరాదని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇవ్వకపోతే గురువారం నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని స్పష్టంచేశారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో సరిగా పనిచేయనివారిని, విధులకు హాజరుకాని వారిని మాత్రమే తొలగిస్తామని, ఆ స్థానంలో ఇప్పటికే తొలగించిన 1,503 మందిలో బాగా పనిచేసే వారిని తిరిగి తీసుకుంటామని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును రెండు నెలల పాటు వాయిదా వేయాలని, ఈలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని కార్మిక నాయకులు కోరగా...మే 20వ తేదీ వరకు ఎవరినీ తొలగించబోమని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో కార్మిక నిరవధిక సమ్మెను మే 20వ తేదీ వరకు వాయిదా వేస్తున్నామని కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు. ఇదిలావుండగా మే 20వ తేదీలోపు మరోసారి ఆర్‌ఎల్‌సీ సమక్షంలో ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్‌ల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. ఈ చర్చల్లో స్టీల్‌ప్లాంట్ అధికారులు గాంధీ, ఖర్, కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు మంత్రి రవి, నీరుకొండ రామచంద్రరావు, కె.వంశీకృష్ణ, సొంబాబు, శ్రీనివాస్, రమణ పాల్గొన్నారు.