ప్రజా సమస్యలే అజెండా
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:40 AM
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మౌలిక సదుపాయలకు సంబందించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వేసవి సమీపిస్తుండడంతో తాగునీటి ఎద్దడి పొంచివుంది. మే నెల నుంచి సమస్య మరింత తీవ్రతరం కానున్నది. మరోవైపు మండలాలకు కేటాయించిన జిల్లా పరిషత్ నిధులు ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
వేసవిలో తాగునీటి ఎద్దడిపై ప్రధానంగా చర్చ
విద్య, వైద్యం, ఇరిగేషన్, వగైరా సమస్యలను ప్రస్తావించనున్న సభ్యులు
అనకాపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మౌలిక సదుపాయలకు సంబందించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వేసవి సమీపిస్తుండడంతో తాగునీటి ఎద్దడి పొంచివుంది. మే నెల నుంచి సమస్య మరింత తీవ్రతరం కానున్నది. మరోవైపు మండలాలకు కేటాయించిన జిల్లా పరిషత్ నిధులు ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. టీడీపీ, జనసేన, వైసీపీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరై తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చకుండా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. ఇంకా విద్య, వైద్యం, సాగునీటి వనరులు, పౌర సరఫరాలు, డ్వామా, డీఆర్‌డీఏ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వివిధ అంశాలు చర్చకు రానున్నట్టు తెలిసింది.
గత కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతుండడంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో బోర్లు అడుగంటే ప్రమాదం వుంది. దీనివల్ల రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సంఘం, జడ్పీ సాధారణ నిధులతో కొత్తగా బోర్లు తవ్వించాలని గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు చేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడడంతో మునగపాక, అనకాపల్లి, కశింకోటతోపాటు పలు మండలాల్లో బోర్లుకు కేటాయించిన నిధులను వినియోగించలేదు. సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ కింద గుర్తించిన తాగునీటి బోర్లకు మరమ్మతులు చేపట్ట లేదు. ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు కోసం జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికాలేదు. ఈ విషయాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించనున్నారు.
అనకాపల్లి నుంచి మునగపాక మీదుగా అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. స్థలాలు, ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు వద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల సభ్యులు సభలో అధికారులను డిమాండ్ చేయనున్నారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ సక్రమంగా జరగకపోవడంతో దేవరాపల్లి మండలానికి చెందిన ఒక రైతు చెరకు తోటకు పంటకు నిప్పంటించి నిరసన తెలిపాడు. ఇంకా పాత బకాయిలు, ఇటీవల ముగిసిన సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లింపులు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరకు రైతుల సమస్యలపై జడ్పీ సమావేశంలో చర్చించే అవకాశం వుంది.
జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గుంతలు లేని రహదారుల పనులు పెద్దఎత్తున జరిగాయి. ఆయా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని కొంతమంది సభ్యులు చెబుతున్నారు.