14 నుంచి సీలేరు మారెమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:41 PM
అల్లూరి జిల్లా జీకేవీధి మండలం సీలేరు మారెమ్మ 53వ వార్షిక మహోత్సవాలు ఈనెల 14 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఈనెల 27వ తేదీన ప్రధాన పండుగ
సీలేరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా జీకేవీధి మండలం సీలేరు మారెమ్మ 53వ వార్షిక మహోత్సవాలు ఈనెల 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను తమిళ సంవత్సరాది రోజు నుంచి ప్రారంభించడం ఆనవాయితీ. సీలేరు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో డ్యాం నిర్మాణ పనుల కోసం తమిళనాడు నుంచి వచ్చిన వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. డ్యాం పనులు పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోగా.. కొంతమంది ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అప్పటి నుంచి మారెమ్మ అమ్మవారిని తమిళులతోపాటు స్థానికులు కూడా కొలుస్తున్నారు. కాలక్రమంలో మారెమ్మ సీలేరు గ్రామ ప్రజల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందింది. 1964లో చిన్న రేకుల షెడ్డులో కొలిచేవారు. తర్వాత భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఏప్రిల్ 14న అమ్మవారి జెండా ఆవిష్కరణతో మారెమ్మ ఉత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం ఈనెల 15న అమ్మవారి గరగ అలంకరణ ఎంతో నియమ నిష్ఠలతో నిర్వహిస్తారు. అమ్మవారి గరగను దీక్షను చేపట్టిన భక్తుడు తలపై ఎత్తుకుని అగ్నిగుండం మీదుగా తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. ఈ విధంగా తొమ్మిది రోజులపాటు అగ్నిగుండం తొక్కుతారు. ఈనెల 26వ తేదీన సీలేరులో అమ్మవారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 27వ తేదీన అమ్మవారి ప్రధాన పండుగను నిర్వహిస్తారు. ఆరోజు భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లిస్తారు. ఈనెల 30వ తేదీన మరుపూజతో మారెమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.