ఆర్‌ఏఆర్‌ఎస్‌లో షుగర్ బీట్ సాగు
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:29 AM
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షుగర్ బీట్ (చక్కెర దుంపలు) పంట సాగు ఆశాజనకంగా ఉందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.ఆదిలక్ష్మి తెలిపారు.

ప్రయోగాత్మకంగా చేపట్టిన శాస్త్రవేత్తలు
చెరకు సాగుకు ప్రత్యామ్నాయంగా ప్రోత్సాహం
‘ఆంధ్రజ్యోతి’తో ప్రధాన శాస్త్రవేత్త ఆదిలక్ష్మి
అనకాపల్లి అగ్రికల్చర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షుగర్ బీట్ (చక్కెర దుంపలు) పంట సాగు ఆశాజనకంగా ఉందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.ఆదిలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, పంచదార, ఇథనాల్ తయారీకి ఉపయోగపడే షుగర్ బీట్ సాగుకు రాష్ట్రంలో ఏఏ ప్రాంతాలు అనువైనవో తెలుసుకునేందుకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్టు చెప్పారు. చల్లని వాతావరణంలో బాగా పెరిగే ఈ పంట ఆరు నెలల్లోనే కోతకొస్తుందని, అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎల్6 రకాన్ని నాటామని పేర్కొన్నారు. పంట సాగు, యాజమాన్య పద్ధతులపై పరిశీలనలు జరుపుతున్నామని చెప్పారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పంచదారలో 20 శాతం షుగర్ బీట్ నుంచే వస్తున్నదని పేర్కొనన్నారు. లఖ్‌నవూలోని భారత చెరకు పరిశోధనా సంస్థ (ఐఐఎస్‌ఆర్) షుగర్ బీట్ పలు వంగడాలను రూపొందించి పరిశోధనలు జరుపుతున్నట్టు ఆమె వివరించారు. చెరకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నందున చెరకు స్థానంలో షుగర్ బీట్ సాగును ప్రోత్సహించడం వల్ల ప్రయోజనం వుంటుందని డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు.