హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:39 AM
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా విధిస్తూ 10వ అదనపు జిల్లా జడ్జి నందనవనం శ్రీవిద్య తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు.

రూ.లక్ష జరిమానా
తీర్పు వెలువరించిన 10వ అదనపు జిల్లా జడ్జి శ్రీవిద్య
కశింకోట, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా విధిస్తూ 10వ అదనపు జిల్లా జడ్జి నందనవనం శ్రీవిద్య తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు. 2018 జూన్ 8న తమిళనాడు రాష్ట్ర మధురైకి చెందిన శర్వణ్‌కుమార్ గణపతి, వెల్లూరు జిల్లా ఆచూరే పోస్ట్‌కు చెందిన కణ్ణన్ మునిరాజ్ కంటైనర్ లారీలో కశింకోట సమీపంలో ఉన్న కాళీప్రసాద్ పెట్రోలు బంకు వద్దకు చేరుకున్నారు. భోజనం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మునిరాజ్ సరదాగా కితకితలు పెట్టడంతో శర్వణ్ కుమార్ కింద పడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం మునిరాజ్ పెట్రోలు బంకు సమీపంలో గుట్టపై విశ్రమిస్తుండగా, శర్వణ్‌కుమార్ కాంక్రీట్ రాయితో దాడి చేసి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రరక్తస్రావంతో ఉన్న మునిరాజ్‌ను స్థానికులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు పంపారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందాడు. అప్పటి సీఐ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. వాదనల అనంతరం శర్వణ్‌కుమార్‌కు యావజ్జీవ కారాగారం, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీవిద్య తుది తీర్పు ఇచ్చారు.