గిరి రైతులకు వర్తకుల దగా
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:18 PM
ఆదివాసీ రైతుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వర్తకులు రిమోట్ తూనిక యంత్రాలతో మోసానికి పాల్పడుతున్నారు. దీంతో రైతులు ఒక బస్తాకు ఎనిమిది నుంచి పది కిలోలు నష్టపోతున్నారు.

రిమోట్ తూనిక యంత్రాలతో మోసం
8 నుంచి 10 కిలోలను నష్టపోతున్న రైతులు
తాజాగా గొల్లపల్లిలో వర్తకుడు, రైతులు వాగ్వాదం
పట్టించుకోని తూనికలు, కొలతల అధికారులు
చింతపల్లి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వర్తకులు రిమోట్ తూనిక యంత్రాలతో మోసానికి పాల్పడుతున్నారు. దీంతో రైతులు ఒక బస్తాకు ఎనిమిది నుంచి పది కిలోలు నష్టపోతున్నారు. ఈ విషయం తాజాగా గూడెంకొత్తవీధి మండలం గొల్లపల్లి గ్రామంలో బయట పడడంతో వర్తకులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
గిరిజన ప్రాంతంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వర్తకులు మోసానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని 80 శాతం మంది ఆదివాసీలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతులు సీజనల్ వారీగా కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, రాజ్‌మా, వలిసెలు, సీకాయ, చింతపండు పంటలను పండించి ప్రైవేటు వర్తకులకు విక్రయిస్తారు. ఈ ఏడాది కాఫీ, మిరియాలు, పసుపు పంటలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. ఈమేరకు వ్యాపారుల మధ్య పోటీ నెలకొన్నది. కొంత మంది వ్యాపారులు ధరను పెంచి తూనికాల్లో భారీగా మోసం చేస్తున్నారు. తాజాగా గూడెంకొత్తవీధి మండలం గొల్లపల్లి గ్రామంలో లోతుగెడ్డకు చెందిన ఇద్దరు వర్తకులు రిమోట్ ఎలక్ట్రికల్ తూనిక యంత్రంతో మిరియాలు కొనుగోలు చేశారు. బస్తాకు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తక్కువ రావడంతో గిరిజనులకు అనుమానం వచ్చింది. దీంతో తమ వద్ద ఉన్న ఎలక్ట్రికల్ తూనిక యంత్రంపై మరోసారి తూకం వేయడంతో ఎనిమిది కిలోల వ్యత్యాసం కనిపించింది. దీంతో రైతులు విక్రయాన్ని నిలిపి వేసి వర్తకులతో గొడవపడ్డారు. గతంలో స్ర్పింగ్, తూనిక రాళ్లతో కొలిచే పరికరాలతో వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. ఈ కొలత పరికరాలతోనూ నాలుగు, ఐదు కిలోల తరుగు వచ్చేది. కాలక్రమంగా ఎలక్ట్రికల్ తూనికల యంత్రాలు అందుబాటులోకి రావడంతో తూకం చేస్తే కచ్చితమైన కొలతలు వస్తాయని ఆదివాసీలు విశ్వసిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రిమోట్ ఎలక్ట్రికల్ తూనిక యంత్రాలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ తూనిక యంత్రంపై పెట్టిన వ్యవసాయ ఉత్పత్తుల బరువు ఎంత ఉన్నప్పటికి వ్యాపారి దూరంగా ఉంటూ రిమోట్‌తో ఒత్తిన కిలోలు మాత్రమే తూనిక యంత్రం డిస్‌ప్లే అవుతుంది. ఈవిధంగా వ్యాపారులు ఆదివాసీ రైతులను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లి, జీకేవీధి మండల శివారు గ్రామాల్లో వర్తకులు రిమోట్ ఎలక్ట్రికల్ తూనిక యంత్రాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో నిరక్షరాస్యులైన ఆదివాసీలు మోసపోతున్నారు. ఈ విషయాన్ని కొంతమంది నిజాయితీ గల వ్యాపారులే చెబుతున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో ఆదివాసీల శ్రమ, ఆదాయాన్ని అడ్డదారిలో దోచుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.