అవినీతి జబ్బుకు ట్రీట్‌మెంట్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:43 AM
కేజీహెచ్‌లో కొన్నిచోట్ల డబ్బులు ఇవ్వనిదే పని జరగదు. ఇది బహిరంగ రహస్యం.

కేజీహెచ్‌లో మార్చురీ వద్ద వసూళ్లకు ఫోరెన్సిక్ విభాగాధిపతి చెక్
ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బోర్డుల ఏర్పాటు
ఫిర్యాదు బాక్సులు కూడా...
అవసరమైన సామగ్రిని నేరుగా అందజేస్తున్న డాక్టర్ మమత
గతంలో కనీసం రూ.5 వేల నుంచి పది వేల రూపాయల వరకూ వసూలు
విశాఖపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో కొన్నిచోట్ల డబ్బులు ఇవ్వనిదే పని జరగదు. ఇది బహిరంగ రహస్యం. అటువంటి వాటిలో మార్చురీ ఒకటి. పోస్టుమార్టం నిర్వహించేందుకు అక్కడ అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. పోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించే ఫోరెన్సిక్ విభాగానికి చెందిన కొందరు వైద్యులు, మార్చురీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది కలిసి ఒక రేటు ఫిక్స్ చేశారు. పోస్టుమార్టం నిర్వహించడానికి, కవర్లు, ఇతర సామగ్రి అందించేందుకు కనీసం రూ.5 వేల నుంచి పది వేల రూపాయల వరకు తీసుకుంటుంటారు. ఈ దందా అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే, అనధికారికంగా సాగుతున్న ఈ వసూళ్లకు చెక్ చెప్పేందుకు ఫోరెన్సిక్ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కె.మమత యత్నిస్తున్నారు.
పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఫోరెన్సిక్ విభాగాధిపతి ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులను ఆమె ఏర్పాటుచేయించారు. అలాగే, ఫిర్యాదు బాక్సులను ఏర్పాటుచేశారు. పోస్టుమార్టం నిర్వహించడానికి ముందు పోలీసులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పత్రాలను ఇచ్చేందుకు పోలీసులతోపాటు మృతుడి కుటుంబ సభ్యులను ఆమె తన ఛాంబర్‌కు పిలిపించుకుంటున్నారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎవరికీ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. అలాగే, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు అవసరమైన కవర్, ఇతరత్రా సామగ్రిని మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసుల సమక్షంలో ఛాంబర్‌లోనే అందజేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయి వెళ్లిపోయే ముందు మరోసారి సదరు కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వెళ్లి డబ్బులు అడిగిందీ, లేనిదీ చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మేరకు సంతకాలు కూడా తీసుకుంటున్నారు. విభాగాధిపతే ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించడం, నేరుగా మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులతోనే మాట్లాడుతుండడంతో సిబ్బంది డబ్బులు అడిగేందుకు భయపడుతున్నారు. కవర్లు, ఇతర సామగ్రి విక్రయించే వ్యక్తులను కూడా మార్చురీ వద్ద లేకుండా చేశారు. దీనివల్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.
రోజుకు పదికిపైగా...
ప్రతిరోజూ కేజీహెచ్‌లోని ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో పది నుంచి 12 వరకు పోస్టుమార్టాలు నిర్వహిస్తుంటారు. కనిష్ఠంగా ఐదు వేలు వేసుకున్నా రోజుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేసేవారు. దీనికి విభాగాధిపతి డాక్టర్ కె.మమత చెక్ చెప్పారు. ఇప్పుడు మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత కిందిస్థాయి సిబ్బంది వందో, రెండొందలో అడగడం తప్ప...ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నిరుపేదలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం తమ దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు డాక్టర్ మమత తెలిపారు. ఎంతోమంది అప్పు చేసి మరీ ఇక్కడ సిబ్బందికి డబ్బులు ఇచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆమె తెలిపారు.