Share News

బాధితులకు భరోసా కల్పించాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:34 PM

తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

బాధితులకు భరోసా కల్పించాలి
పోలీస్‌ అధికారులతో సమావేశమైన జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌

పోలీస్‌ అధికారులకు ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ ఆదేశం

పోలీస్‌ స్టేషన్‌ వచ్చే వారికి మర్యాద ఇవ్వాలి

మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా

మాదకద్రవ్యాలకు విద్యార్థులు

దూరంగా ఉండేటట్టు చూడాలి

గంజాయి సాగు, రవాణాపై నిరంతర నిఘా

పాడేరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని పోలీస్‌ అధికారులతో ఇక్కడ నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, గంజాయి, ఇతర కేసుల్లోని పరారీలో ఉన్న నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయాలన్నారు. అలాగే మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలన్నారు. అలాగే గంజాయి సాగును అరికట్టేందుకు, రవాణాను నియంత్రించేందుకు నిఘా పెట్టడడంతోపాటు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అలాగే ప్రధానమైన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని, నేర నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే శక్తి యాప్‌పై ప్రజల్లోనూ, విద్యాలయాల్లోనూ మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

మావోయిస్టుల కదలికలపై గట్ఠి నిఘా

జిల్లా సరిహద్దులో ఉన్న పక్క రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ సూచించారు. అలాగే సరిహద్దులో ఉన్న పోలీస్‌ స్టేషన్లకు భద్రతను పెంచడంతోపాటు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనల నేపథ్యంలో రోడ్లు, కల్వర్టుల్లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అలాగే మావోయిస్టులకు చెందిన మిలీషియా, ముఖ్యసభ్యులు లొంగిపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంపూర్ణమైన పునరావాసం కల్పిస్తామని మారుమూలప్రాంతాల్లో ప్రచారం చేసి, లొంగిపోయే వారిలో భరోసా నింపాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పీ కె.ధీరజ్‌, చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా, రంపచోడవరం డీఎస్‌పీ జి.సాయిప్రశాంత్‌, డీసీసీబీ సీఐ సంజీవరావు, ఎస్‌బీ సీఐ బి.అప్పలనాయుడు, జిల్లాకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 10:34 PM