CM Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:33 PM
విశాఖ: నగరంలో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతిఒక్కరికీ పేరుపేరున నమస్కారాలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. సభకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ: నగరంలో ఏర్పాటు చేసిన రోడ్ షో అదిరిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తోందని చంద్రబాబు తెలిపారు. విశాఖ సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరున నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. సభకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడికెళ్లినా ప్రధాన మంత్రిపై ప్రజలు నమ్మకం చూపిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. దేశ ప్రజలకు మోదీపై నమ్మకం, విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి చేతులమీదుగా రూ.2.08,545 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటన తన జీవితంలో, ఆంధ్రరాష్ట్ర చరిత్రలో మెుట్టమెుదటిసారిగా జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.." రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. వీటికి రూ.6,177 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. రూ.5,718 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులు నేడు ప్రారంభం చేస్తున్నాం. విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాం. రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశాం. రూ.3,044 కోట్లతో 234 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేశాం. ఇది ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలే అయ్యింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారు. వచ్చిన వెంటనే రూ.2.08,545 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారంటే ఏపీ పట్ల ఆయన నిబద్ధత ఏంటో తెలుస్తోంది. ఇలాంటి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ. 7 మండలాలను రాష్ట్రంలో విలీనం చేసిన వ్యక్తి మోదీ. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతాం.
ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్స్, ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలతోపాటు 12 యూనివర్సిటీలు ఏపీకి కేటాయించారు. కేంద్రం సాయంతో నిలదొక్కుకుని ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. కష్టాలు, సమస్యలను అధిగమించి ముందుకెళ్తాం. కేంద్రం సాయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకుంటున్నాం. ప్రధాని మోదీ నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతుంటా. అమరావతి నిర్మాణంలో మోదీ సహకారం కావాలి. అమరావతిని త్వరలో పూర్తి చేస్తాం. మోదీ సారథ్యంలోనే పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. భవిష్యత్‌లోనూ మా కూటమి కొనసాగుతుంది. ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీఏనే. మేమంతా మోదీతోనే ఉంటాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి ఆయన. మా కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ. దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ" అని చెప్పారు.
Updated Date - Jan 08 , 2025 | 07:34 PM