Share News

విశ్వనాథ్‌ అడ్వంచర్స్‌ అరాచకం

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:10 AM

నగరంలోని పోర్టు స్టేడియం (అక్కయ్యపాలెం)లో నిర్వహిస్తున్న విశ్వనాథ్‌ అడ్వంచర్స్‌ స్పోర్ట్స్‌లో భద్రత ఎంత?...అనే దానిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వనాథ్‌ అడ్వంచర్స్‌ అరాచకం

  • అడుగడుగునా లోపాలు

  • కానరాని భద్రతా చర్యలు

  • కేర్‌ టేకర్లు లేరు

  • ఆక్వా స్పోర్ట్సులో లైఫ్‌ గార్డ్సు నిల్‌

  • అగ్ని ప్రమాదం సంభవిస్తే అదుపుచేసే యంత్రాంగం లేదు

  • ఏడేళ్ల బాలుడి మృతితో బయటపడిన నిర్వహణ వైఫల్యం

  • జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఫిర్యాదు

  • అధికారుల బృందం పరిశీలన

  • తాత్కాలికంగా అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ నిలిపివేత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని పోర్టు స్టేడియం (అక్కయ్యపాలెం)లో నిర్వహిస్తున్న విశ్వనాథ్‌ అడ్వంచర్స్‌ స్పోర్ట్స్‌లో భద్రత ఎంత?...అనే దానిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు నుంచి లీజుకు తీసుకున్న స్టేడియంలో ఇటీవల అనేక రకాల అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆక్వా స్పోర్ట్స్‌కు వెళ్లిన ఏడేళ్ల బాలుడు రుషి సోమవారం సాయంత్రం నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా చేయడానికి అడ్వంచర్‌ స్పోర్ట్సు నిర్వాహకులు, పోలీసులు యత్నించారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చారని సమాచారం. అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు ఈ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు సంబంధించి ఇప్పటికే చేదు అనుభవాలు ఉండడంతో తీవ్రంగా స్పందించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు.

పర్యాటక శాఖ అధికారులు, విశాఖ అర్బన్‌ తహసీల్దార్‌, పోలీసు అధికారులు కలిసి వెళ్లి పరిశీలించి ప్రాథమిక నివేదిక అందజేశారు. అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ను తక్షణమే ఆపేయాలని ఆదేశించారు. రెస్టారెంట్‌, ఇండోర్‌ గేమ్స్‌, బాక్స్‌ క్రికెట్‌ వంటివి నిర్వహించుకోవచ్చునని, మళ్లీ చెప్పేంత వరకు అడ్వంచర్‌ స్పోర్ట్‌ నడపకూడదని స్పష్టంచేశారు.

ఎన్నో రకాలు..?

విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ పేరుతో గో కార్టింగ్‌, జిప్‌ లైనర్‌, స్విమ్మింగ్‌, ఆక్వా స్పోర్ట్స్‌, స్నో వరల్డ్‌...ఇలా అనేకం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏది చేసినా భారత ప్రమాణాల (ఇండియన్‌ స్టాండర్డ్‌) కోడ్‌ పాటించాలి. సంబంధిత సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. కొన్నింటికి ఎన్‌ఓసీలు కూడా అవసరం. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అధికారుల పరిశీలనలో ఇక్కడ స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) పాటించడం లేదని తేలింది. కేవలం ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకొని అన్నీ నడుపుతున్నట్టు భావిస్తున్నారు.

ఇవీ లోపాలు

- ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు లేవు.

- ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడడానికి శిక్షణ పొందిన వారు లేరు.

- ఆక్వా స్పోర్ట్స్‌లో లైఫ్‌ గార్డ్స్‌ లేవు.

- వాటర్‌ కెపాసిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ లేదు.

- అగ్నిప్రమాద నివారణకు ఎక్విప్‌మెంట్‌ లేదు.

- సర్టిఫైడ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ లేరు.

- కొన్నింటికి ఎన్‌ఓసీలు అవసరం. అవి లేవు.

జిల్లాలో అనేకం

ఒక్క విశ్వనాథ్‌ ఆక్వా స్పోర్ట్స్‌ కాకుండా జిల్లాలో ఇంకా అనేకచోట్ల ఇలాంటివి ఉన్నాయి. పెందుర్తి పరిసరాల్లో ఇలాంటిదే నిర్వహిస్తున్నారు. ఆనందపురంలో గో కార్టింగ్‌ నడుపుతున్నారు. అక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ముందు జాగ్రత్తలో వీఎంఆర్‌డీఏ

పర్యాటకుల కోసం వీఎంఆర్‌డీఏ కూడా అనేకం నిర్వహిస్తోంది. ఇటీవల కైలాసగిరిపై సర్క్యులర్‌ ట్రైన్‌ నిర్వహణ సరిగా లేదని దానిని ఆపేసింది. అలాగే రోప్‌వే వద్ద చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని, నిర్వాహకుల నిర్లక్ష్యం గుర్తించి వారికి కాంట్రాక్టు రెన్యువల్‌ చేయలేదు. మళ్లీ టెండర్లు పిలిచారు. పర్యాటక శాఖ కూడా రుషికొండలో వాతావరణం బాగుండకపోతే బోటు షికారు నిలిపివేస్తోంది. ఇవన్నీ ప్రమాదాలు జరగకుండా చేపట్టే ముందస్తు చర్యలు. ప్రైవేటు సంస్థలు కూడా ఇలాగే నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.


బాలుడిని బలిగొన్న ఈతకొలను

విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో దారుణం

ఘటనపై పోలీసుల గోప్యత!

స్టేషన్‌ ఆవరణలోనే సెటిల్‌మెంట్‌?

విచారణకు రంగంలోకి దిగిన సీపీ

విశాఖపట్నం/సీతంపేట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

పోర్టు స్టేడియంలో గల విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆక్వా వరల్డ్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో సోమవారం సాయంత్రం ఏడేళ్ల బాలుడు రిషిత్‌ సాయి శ్రీకర్‌ మృతిచెందాడు. అక్కడ కేర్‌ టేకర్‌ లేకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌లో బాలుడు మునిగిపోయినట్టు చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మురళీనగర్‌ ఎన్‌జీఓఎస్‌ కాలనీకి చెందిన వాసుపల్లి గారగారావు అలియాస్‌ గంగాధర్‌ తన భార్య, కుమారుడు రిషిత్‌ సాయి శ్రీకర్‌ (7), తన చెల్లెలి పిల్లలతో కలిసి సోమవారం సాయంత్రం పోర్టు స్డేడియంలో విశ్వనాథ్‌ ఆక్వా వాటర్‌ వరల్డ్‌కు వెళ్లారు. పిల్లలు ఒక్కొక్కరికి రూ.800 చొప్పున రూ.2,400 పెట్టి మూడు టికెట్లు కొని వారిని లోపలకు పంపించారు. తల్లిదండ్రులు బయట ఉండి చూస్తున్నారు. కొద్దిసేపటికి కాఫీ తాగడానికి వారిద్దరూ పక్కకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఏడేళ్ల కుమారుడు రిషిత్‌ కనిపించలేదు. అక్కడి వారిని అడిగితే నీటిలో మునిగిపోయాడని, సమీపానున్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి బైక్‌పై తీసుకువెళ్లారని చెప్పారు. దాంతో పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేశాయి. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేయడంతోపాటు, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం రాత్రి బాలుడు మృతి చెందినప్పటికీ గోప్యంగా ఉంచారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే నిర్వాహకులతో బాలుడి తల్లిదండ్రులు సెటిల్‌మెంట్‌ చేసుకునేలా మంతనాలు జరిగాయి. చివరికి బాధిత కుటుంబానికి రూ.లక్షల్లో నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో బాలుడు ఆడుకుంటూ పడిపోయాడని ఫిర్యాదు ఇవ్వడం, ఆ మేరకు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదుచేయడం జరిగింది. పెద్దమొత్తంలో సెటిల్‌మెంట్‌ జరిగిందని, దీనికి పోలీసులు సహకరించారనే ప్రచారం జరుగుతోంది. అయితే సంఘటనపై ఫిర్యాదులు అందడంతో నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, డీసీపీ డాక్టర్‌ అజితలు మంగళవారం విశ్వనాఽథ్‌ స్పోర్ట్స్‌ ఆక్వా వాటర్‌ వరల్డ్‌ను పరిశీలించి విచారణ చేపట్టారు.


విశ్వనాథ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్ప్‌లో భద్రత శూన్యం

అందుకే అక్కడకు వెళ్లిన పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు

లీజు నిబంధనలను తరువాత సవరించినట్టు తెలిసింది

పోర్టు చైర్మన్‌తో మాట్లాడతా

సీబీఐతో విచారణ చేయించాలి

‘నార్త్‌’ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్న విశ్వనాథ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌లో సరైన భద్రత చర్యలు కానరావడం లేదని, అందువల్ల దానిని తక్షణమే మూసివేయాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. ఆక్వా స్పోర్ట్స్‌కు వెళ్లిన రుషి అనే ఏడేళ్ల బాలుడు సోమవారం సాయంత్రం మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంగళవారం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన విష్ణుకుమార్‌రాజు విలేకరులతో మాట్లాడారు. స్టేడియాన్ని పోర్టు నుంచి లీజుకు తీసుకున్న విశ్వనాథ్‌ కన్వెన్షన్స్‌ ఆ తరువాత అక్కడ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ ప్రారంభించిందన్నారు. స్టేడియాన్ని లీజుకు తీసుకున్నప్పుడు ఉన్న నిబంధనలను ఆ తరువాత సవరించారని తెలిసిందని, దీనిపై తాను పోర్టు చైర్మన్‌తో మాట్లాడతానన్నారు. అవసరమైతే సీబీఐకే ఫిర్యాదు చేసి విచారణ కోరతామన్నారు. అక్కడ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌లో కనీస భద్రత చర్యలు లేవని ఆయన ఆరోపించారు. గత ఏడాది మే నెలలో తన మనవరాళ్లు ఇద్దరు అక్కడికి గో కార్టింగ్‌కు వెళ్లగా, వారిలో ఒకరు ప్రమాదానికి గురై పక్కన రహదారిపైకి తుళ్లిపడ్డారన్నారు. ఆ ఘటనలో తన మనుమరాలు 45 రోజులు చికిత్స తీసుకుందని, వెన్నెముక సమస్య కూడా వచ్చిందన్నారు. ఇలాగే అక్కడికి వెళ్లిన చాలామంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. తాజా ఘటనకు వస్తే...పిల్లలు నీటిలో ఆడుకునే దగ్గర ఏదైనా జరిగితే కాపాడడానికి సంరక్షకులను ఉంచాలని, అటువంటి కనీస చర్యలు కూడా వారు చేపట్టకపోవడం విచారకరమన్నారు. జిల్లా కలెక్టర్‌కు దీనిపై ఫిర్యాదు చేశానన్నారు. ఏ అనుమతులతో వాటిని నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలని, భద్రత చర్యలు కూడా చూడాలని, లేనిపక్షంలో దానిని మూసివేసి, పిల్లల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.

Updated Date - Apr 09 , 2025 | 01:10 AM