Chinna Jeeyar Swamy : ట్రస్టు బోర్డులువీఐపీల సేవలకా?
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:25 AM
ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు.

ఆక్రమణల నుంచి ఆలయాలకు విముక్తి
చినజీయర్ స్వామీజీ పిలుపు
విజయవాడ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన ‘హైందవ శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు. తిరుపతిలో చైర్మన్ ఒకరు తన హయాంలో 4.50 లక్షల మందికి వీఐపీ దర్శనాలను కల్పించారని విన్నామని, డబ్బున్న వారికి దర్శనాలు చేయించేందుకే దేవుడి దగ్గర ఉన్నామా? అని ప్రశ్నించారు. వీఐపీ దర్శనాల పేరిట పేదలను దేవుడికి దూరం పెడితే.. వారు ఇతర మతాల్లోకి ఎందుకుపోరని ప్రశ్నించారు. వీఐపీల సేవలో తరించేవారు ట్రస్టుబోర్డు సభ్యులుగా పనికిరారన్నారు. దేశంలో స్వాతంత్య్రం రాకముందే 1718లో దేవదాయ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. 1840లో మేనేజ్‌మెంట్ పేరుతో రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కమిటీల్లోకి తీసుకురావటం జరిగిందన్నారు. నేడు ఆలయాలన్నీ పరాధీనమైపోయాయన్నారు. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన భూములు 15 లక్షల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 4.50 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని తెలుస్తోందని తెలిపారు. కమలానందభారతి స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవదాయ శాఖనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, పల్లవులు, చోళులు, జమీందార్లు, ప్రజలు సొంతంగా కట్టించిన ఆలయాలపై ప్రభుత్వ పెత్తనమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ, ధర్మాదాయ చ ట్టం పేరులో హిందూ అనే పదాన్ని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లెలో దేవాలయాలున్నాయని, వీటిలో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉన్నాయని చెప్పారు. ఆలయాలను సంరక్షించుకోవటానికి చేస్తున్న ఈ ప్రయత్నం కొనియాడదగినదని, దత్తుడి ఆశీర్వచనంతో పోరాటం ఫలించాలని ఆకాక్షించారు. రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... 1984లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చల్లా కొండయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, 1987లో దేవదాయ ధర్మాదాయ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ చట్టం ద్వారా దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, హైందవుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు.