Investigation Controversy: విచారణ పేరుతో వేధిస్తున్నారు
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:06 AM
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య పద్మావతి ఆరోపించారు. సిట్ విచారణలో తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని పద్మావతి అభిప్రాయపడ్డారు

వివేకా కేసులో అనుమానితుడు శ్రీనివాసులరెడ్డి భార్య పద్మావతి ఆరోపణ
పులివెందుల, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): విచారణ పేరుతో తన పిల్లలను వేధిస్తున్నారని వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉండి ఆత్మహత్య చేసుకున్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి భార్య పద్మావతి ఆరోపించారు. వివేకా హత్యకేసులో ఇప్పటికే కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గంగాధర్, అభిషేక్‌రెడ్డి, జగన్ కారు డ్రైవర్ నారాయణ మరణించగా, ఇటీవల వాచ్‌మాన్ రంగన్న కూడా అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకున్న ప్రభుత్వం.. సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. సిట్ బృందం వీరందరి మరణాలపై విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి మేనల్లుళ్లు, బావమరిదిని ఇటీవల రెండుసార్లు పోలీసులు కడప, పులివెందులకు పిలిచి విచారించారు. ఈ విషయంలో పోలీసుల తీరును పద్మావతి ఖండించారు. ‘వివేకా కేసులో నా భర్తను మొదట నిందితుడిగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనుమానితుడిగా తేల్చారు. ఆయన 2019లో ఆత్మహత్మ చేసుకున్నారు.
ఆ రోజు సీఐ శ్రీరామ్ పిలిస్తే విచారణకు వెళ్లి, సాయంత్రానికి వచ్చి, పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరామ్ తనను బెరించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. సీఐ శ్రీరామ్‌పై నా భర్త చేసిన ఆరోపణలపై ఆరేళ్లయినా విచారణ చేయలేదు. కానీ, నా భర్తను బతికించుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్లిన మేనల్లుళ్లు, బావమరిదిని సిట్ అధికారులు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు.’’ అని పద్మావతి ఆరోపించారు.