‘ఉపాధి’లో అట్టడుగున...!
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:08 AM
At the bottom of 'Employment'...!ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగున నిలవడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. కూలీలకు అందుతున్న సగటు కనీస వేతనం జిల్లాలో రూ.162గా నమోదైంది. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారుల్లో కలవరం నెలకొంది. షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

‘ఉపాధి’లో అట్టడుగున...!
కనీస వేతనంలో జిల్లాకు చివరి స్థానం
సగటు వేతనం కేవలం రూ.162
రూ.241 తో వంగర మండలం ప్రథమ స్థానం
రూ.125తో చివరిస్థానంలో గరివిడి
ఉపాధి హామీ అధికారులు, సిబ్బందికి షోకాజ్‌లు
మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు: డ్వామా పీడీ శారదాదేవి
మెంటాడ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి):
ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగున నిలవడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. కూలీలకు అందుతున్న సగటు కనీస వేతనం జిల్లాలో రూ.162గా నమోదైంది. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారుల్లో కలవరం నెలకొంది. షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈనెల ఒకటి నుంచి వేతనదారులకు కనీస వేతనం రూ.307 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అందుకోవడానికి యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో జిల్లాలవారీగా కూలీలకు అందుతున్న సగటు వేతనలతో కూడిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల జాబితాలో సగటు వేతనం రూ.162.30తో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఎన్టీఆర్ జిల్లా రూ.291.53తో మొదటి స్థానంలో నిలిచింది. రూ.290.60తో కోనసీమ జిల్లా రెండో స్థానంలో నిలవగా, 289.43తో అల్లూరి జిల్లా మూడో స్థానంలో ఉంది.
జిల్లాలో సగటు ఉపాధి వేతనం 162.30 కాగా రూ.241.76తో వంగర మండలం ప్రథమ స్థానంలో ఉంది. రూ.225.56తో పూసపాటిరేగ మండలం రెండో స్థానంలోనూ, రూ. 224.16తో భోగాపురం మూడో స్థానంలో ఉన్నాయి. రూ.125.30తో వేపాడ మండలం చిట్టచివరన నిలిచింది. మెంటాడ మండలం చింతాడవలస పంచాయతీలో దినసరి వేతనం రూ.80 రావడంతో కొద్దిరోజులు క్రితం ఉపాధి వేతనదారులు ఆందోళన చేపట్టారు. ఇలా చాలా పంచాయతీలలో వందలోపు వేతనం లభించింది. అంటే ఉపాధి వేతనదారులు ఏమి తినాలి, కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో అధికారులకే ఎరుక.
రూ.1.80 కోట్లు నష్టపోయిన కూలీలు
కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి రూ.307గా సవరించింది. కానీ జిల్లాలో సగటున గిట్టుబాటు అయిన వేతనం 162 రూపాయలే. జిల్లాలో ఉపాధి వేతనదారుల సంఖ్య చూస్తే లక్షా 24 వేల 149 మంది ఉన్నారు. వీరంతా కూలి రూపంలో నష్టపోయింది కోటి 80 లక్షల 1605 రూపాయలు.
షోకాజ్ నోటీసులు
కనీస వేతనం కల్పించడంలో విఫలమైన అధికారులు, సిబ్బందికి డ్వామా పీడీ ఎస్.శారదా దేవి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపిఓలు, జేఈ, ఈసిలకు కూడా నోటీసులు జారీ చేసి మూడురోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించడంతో నోటీసులు అందుకున్నవారు సంజాయిషీకి మల్లగుల్లాలు పడుతున్నారు.
మూడు మండలాలకు మినహాయింపు
షోకాజ్ నోటీసులు నుంచి వంగర, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగున ఉండగా జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో వంగర, పూసపాటిరేగ, భోగాపురం నిలిచాయి. దీంతో ఆ మండలాల సిబ్బందికి షోకాజ్ నోటీసుల నుంచి మినహాయించారు. సగటు రూ.200 లోపు కనీస వేతనం వచ్చిన మండలాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
జిల్లాకూ నష్టమే?
అతితక్కువ వేతనం గిట్టుబాటు కారణంగా రాష్ట్రస్థాయిలో అట్టడుగున ఉండడంతో ఆ ప్రభావం జిల్లాకు మంజూరయ్యే ఉపాధి నిధులపై పడే ప్రమాదం ఉండొచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉపాధి కూలీలకు పనిదినాలు కల్పన, ఈ నిధులతో పనులు చేపట్టడం,వేతనదారులకు కనీస వేతనం గిట్టుబాటు అయ్యేలా చూడడం,వేతనాలు సకాలంలో విడుదల అయ్యేలా శ్రద్ధ తీసుకోవడంలో ఇప్పటివరకు జిల్లాకు ఎంతో మంచిపేరు ఉండేది. గతంలో పలు అవార్డులు జిల్లాను వరించాయి. తాజా పరిణామాలు మొదటిసారి జిల్లా తలదించుకునేలా చేశాయన్న ఆవేదన ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఎండలపై నెపం...
మండే ఎండల కారణంగా వేతనదారులు పూర్తిస్థాయిలో పనులు చేయలేదని నెపం వారిపై నెట్టేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. షోకాజ్ అందుకున్న అధికారులు, సిబ్బంది ఇదే విషయాన్ని సంజాయిషీలో పేర్కొనాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న నోటీసు అందుకున్న ఉపాధిహామీ పథకం అధికారులు,సిబ్బంది మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. అయితే సెలవలు కావడంతో మంగళ లేదా బుధవారం నాటికి బదులివ్వాల్సి ఉంది.
నోటీసులు ఇచ్చాం
శారదాదేవి, పీడీ, డ్వామా
ఉపాధిలో దినసరి వేతనం గిట్టుబాటు అయ్యేలా సిబ్బంది ప్రయత్నించాలి. మూడు మండలాలు మినహా అన్నీ రూ.200 దినసరి వేతనం కల్పించడంలో వెనకబడ్డాయి. ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం రూ.200 లోపు కలిగిన మండల అధికారులకు నోటీసులు ఇచ్చాం. ఏపిఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, జేఈ, ఈసిలకు నోటీసులు అందజేశాం.
---------------