ganjai will be completely banned గంజాయిని పూర్తిగా కట్టడి చేస్తాం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:43 PM
Cannabis will be completely banned గంజాయి సాగు.. రవాణాను పూర్తిగా కట్టడి చేస్తామని, ఇందుకోసం 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ తెలిపారు. గంజాయిపై బోర్డర్ పోలీస్‌స్టేషన్ల అధికారులతోనూ నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గంజాయిని పూర్తిగా కట్టడి చేస్తాం
24 చెక్‌పోస్టులు ఏర్పాటు
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ
రామభద్రపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు.. రవాణాను పూర్తిగా కట్టడి చేస్తామని, ఇందుకోసం 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ తెలిపారు. గంజాయిపై బోర్డర్ పోలీస్‌స్టేషన్ల అధికారులతోనూ నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రిసెప్సన్ గదిని పరిశీలించి రికార్డులు, సీడీ ఫైల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశాఖ రేంజ్ పరిధిలో 280 చోట్ల గంజాయి బేస్‌లను గుర్తించామని, డైనమిక్ చెక్‌పోస్టుల సిబ్బంది ద్వారా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గంజాయి సాగును ఆపడానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన రైతులకు అవగాహన కల్పించామని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకునేలా చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విజయనగరం జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుం డడంతో రోడ్డు సేఫ్టీ అధికారులు, నే షనల్ హైవే అధికారులతో సమీక్షిస్తూనే బ్లాక్‌స్పాట్‌లు గుర్తిస్తున్నామని చెప్పారు. మహిళలపై దాడులు అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, శక్తి యాప్ ద్వారా మహిళలు ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. విశాఖ రేంజ్ పరిధిలో నక్సల్స్ కదలికలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడ వరం, చింటూరు, మారేడుమిల్లి, డొంకరాయి, మోతుగూడెం, గుర్తేడు ప్రాంతాల్లో 2 నక్సల్స్ టీములు ఉన్నాయని, సుమారు 18మంది నక్సల్స్ దళాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అనంతరం మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. గ్రామ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు మహిళా పోలీసులు కీలకపాత్ర వహించాలని సూచించారు. గ్రామాల్లో ఏ సమాచారం అయినా వెంటనే ఉన్నతాధికారులకు అందించాలన్నారు. సంకల్పం, శక్తి యాప్‌లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మహిళా పోలీసులదే అన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన వాహనాల షెడ్‌ను ప్రారంభించారు. ఆయన వెంట ఎస్పీ వకుల్‌జిందాల్, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, రామభద్రపురం ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు తదితరులు ఉన్నారు.
నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: డీఐజీ
విజయనగరం క్రైం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): శిక్షణార్థులు విధి నిర్వహణలో పాటించాల్సిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ సూచించారు. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలను గురువారం సందర్శించిన ఆయన పీటీసీలో వున్న శిక్షణ వసతులు, ఆసుపత్రి పరిపాలనా భవనం, గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాల్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరాజు, వైస్ ప్రిన్సిపాల్ పీవీ అప్పారావు, డీఎస్పీలు శ్రీకాంత్, రమేష్, ఏవో భవానీ తదితరులు ఉన్నారు.
పోలీస్ బెటాలియన్ శిక్షణ కేంద్రం పరిశీలన
డెంకాడ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): చింతలవలస వద్దనున్న ఏపీఎస్‌పీ పోలీస్ బెటాలియన్
శిక్షణ కేంద్రాన్ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గురువారం పరిశీలించారు. అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను కమాండెంట్ మలికాగార్గ్ వివరించారు. ఆయన వెంట ఎస్పీ వకుల్‌జిందాల్ ఉన్నారు.