Share News

Festivity in the hill regions గిరిసీమల్లో సందడి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:52 PM

Festivity in the hill regions జిల్లాలోని గిరిసీమల్లో సందడి మొదలైంది. ఇటుక పండగ ప్రారంభమైంది. ఉగాది (చైత్రోత్సవాలు) ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుం టున్నారు.

 Festivity in the hill regions  గిరిసీమల్లో సందడి
చెరుకుపల్లి వద్ద గేటు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి సుంకం వసూలు చేస్తున్న గిరిజనులు

సంబరాల్లో గిరిజనులు

పితృ, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిసీమల్లో సందడి మొదలైంది. ఇటుక పండగ ప్రారంభమైంది. ఉగాది (చైత్రోత్సవాలు) ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుం టున్నారు. పెద్దపండగగా భావించే వారు నియమ నిష్ఠలతో పితృదేవతలను పూజిస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు జరుపుతున్నారు. తమ వారసులకు వేట నేర్పిస్తూ.. కుటుంబ ఐక్యతను చాటిచెబుతున్నారు. మొత్తంగా గిరిజనులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు.

గ్రామ పెద్ద నిర్ణయం మేరకు..

వాస్తవంగా చైత్రమాసంలో జరుపుకునే ఇటుక పండగను మన్యంలో అన్ని గిరిజన గ్రామాల్లో ఒకే రోజు నిర్వహించరు. చైత్ర శుద్ధ పాడ్యమి తర్వాత గ్రామపెద్ద నిర్ణయం మేరకు ఈ పండగను జరుపుతారు. ఈ పండగ ప్రారంభానికి ముందుగా గ్రామానికి పాత చీపుర్లు, చెప్పులు, చేటలతో కట్టుకడతారు. దీని వల్ల గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశించవని వారి నమ్మకం. సాదారణంగా గురువారం నుంచి పండగ ప్రారంభించి మంగళవారం ముగిస్తారు. అయితే వేట లభ్యం కాని పక్షంలో ఈ పండగ పొడిగింపు ఉంటుంది.

పండగ ఇలా..

పండగ తొలిరోజున కుటుంబాల వారీగా (ఇంటి పేరు ఒకటిగా ఉన్న వంశస్థులు) బియ్యం సేకరిస్తారు. గత ఇటుక పండగ తర్వాత వివాహాలు చేసుకున్న జంటలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. వారితో కలసి ఒకే ఇంటిపేరున్న కుటుంబీకులంతా భోజనాలు చేస్తారు. రెండో రోజు కొత్త మామిడితో పచ్చడి చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. పితృదేవతలకు కొత్త బట్టలు , అన్నం, కూర తదితర ఆహార పదార్థాలను మూలన పెట్టి పూజిస్తారు. కోడిని సైతం మొక్కుబడిగా చెల్లిస్తారు. మూడో రోజు నేల తల్లికి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా థింసా, తమ సంస్కృతికి సంబంధించిన నృత్యాలు చేసి అంతా సంతోషంగా గడుపుతారు. నాలుగో రోజు ఇటుక పండగ చేస్తారు. ఈ సందర్భంగా తొలుత గోనస వేట చేస్తారు. దానిని ఽథింసా వాయిద్యాలతో గ్రామాల్లో ఊరేగిస్తారు. దానికి గిరిజన పూజారి పూజలు చేస్తారు. తమ గ్రామదేవత ( ఒక్కో గ్రామానికి ఒక్కో దేవత ఉంటుంది. )లకు పూజలు చేస్తారు. అనంతరం వేటకు వేళ్లే వారికి భత్యం (బియ్యం, డబ్బులు, ఇతర సామగ్రి) సేకరిస్తారు. ఐదో రోజున వేట సులభంగా సాగి వీలైనంత పెద్ద జంతువు దొరకాలని ఆశిస్తూ అడవి తల్లికి పూజలు చేస్తారు. అడవి తల్లికి నైవెద్యంగా కోడిని వదిలి పెడతారు. ఈ పూజలన్ని సంప్రదాయబద్ధంగా గిరిజన పూజారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆరో రోజు గ్రామంలో పురుషులు వేటకు బయలుదేరుతారు. వారు ఏదైనా జంతువుతో ( కనీసం కుందేలు ) తిరిగి వచ్చే వరకు మహిళలు దుస్తులు ఉతకరు. వాకిలు ఊడ్చరు. పనులకు కూడా వెళ్లరు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత బోరు కూడా కొట్టరు. వేటకు వెళ్లని వారు సైతం ఎటువంటి పనులకు వెళ్లరు. ఉద్యోగులు మాత్రం గ్రామకట్టుబాటు ప్రకారం జరిమానా చెల్లించి విధులకు వెళ్తారు. వేటకు వెళ్లిన వారు వచ్చే వరకు కొందరు సమీప పట్టణాలకు వెళ్లిన థింసా నృత్యాలు చేస్తూ సుంకం వసూలు చేస్తారు. అదేవిధంగా రహదారుల్లో టోల్‌గేట్‌లా కర్ర అడ్డం పెట్టి వాహనాలను నిలిపి ఎంతో కొంత వసూలు చేస్తారు. అయితే కచ్చితంగా సుంకం ఇవ్వాలనే ఒత్తిడి లేదు. సాలూరు మండలం జీగిరాం నుంచి పి.కోనవలస వరకు గిరిజనులు పలు చోట్ల సుంకం వసూలుకు టోల్‌గేట్లు పెట్టాగా.. కొందరు వాహనదారులు యూపీఐ ద్వారా సుంకం చెల్లించారు. వారు సంతోషంగా ఇచ్చిన పైకంతో గ్రామస్తులంతా సరదా చేసుకుంటారు. వేటకు వెళ్లిన వారు జంతువులతో తిరిగి వస్తే దానిని అంతా సమానంగా పంచుకుంటారు. సన్నిహితులకు, బంధువులకు నజరానాగా పంపిస్తారు. ఇటుక పండగ వల్ల గిరిజనుల్లో ఐక్యత, అనురాగాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య అనుబంధాలను పటిష్ఠమవుతాయి. గ్రామ బాధ్యతను అంతా అవగహన చేసుకుంటారు. ఈ పండగ తమలో ఆనందోత్సవాలను నింపుతుందని గిరిజనులు చెబుతున్నారు.

గిరిజన సంస్కృతికి ప్రతీక

ఇటుక పండగ గిరిజన సంస్కృతికి ప్రతీక. మా సంప్రదాయాలు, బాధ్యతలను తెలుసుకోవడానికి వీలుంటుంది. ఈ పండగ పితృదేవతలు, జీవన విధాన ఆచారాలకు సంబంధించినది. అందువల్ల ఈ పండగను ఘనంగా నిర్వహిస్తాం.

- మజ్జి కన్నయ్య, కూనంబందవలస

=====================================

ఎలా జీవించాలో తెలుస్తుంది..

మా పూర్వీకులు ఎలా జీవించారో ఈ పండగ తెలుపుతుంది. అడవుల్లో ఎలా ఉండాలో కూడా నేర్పుతుంది. పూర్వీకులను పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

- సొండి లక్ష్మి, పణుకువలస

Updated Date - Apr 14 , 2025 | 11:52 PM