ఐదేళ్ల బాలికపై అత్యాచారం
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:51 AM
విజయనగరం జిల్లా ఓ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి 15ఏళ్ల బాలుడు శనివారం అత్యాచారం చేశాడు.

లక్కవరపుకోట, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా ఓ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి 15ఏళ్ల బాలుడు శనివారం అత్యాచారం చేశాడు. వేర్వేరు వీధుల్లో ఉండే బాలిక, బాలుడి కుటుంబాలు స్నేహంగా ఉంటాయి. బాలుడు నిత్యం బాలిక ఇంటికి వస్తుంటాడు. శనివారం ఉదయం కూడా బాలుడు ఆ బాలిక ఇంటికి వెళ్లగా చిన్నారి టీవీ చూస్తూ కనిపించింది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలి పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక ఏడుస్తూ కనిపించింది. ఏమైందని అడిగితే జరిగిన విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట సీఐ ఎల్.అప్పలనాయుడు విచారణ చేపట్టారు. బాలికను ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఎస్‌ఐ నవీన్‌పడాల్ చెప్పారు. తహసీల్దార్ ప్రసాదరావు స్థానిక పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో కీర్తి సీహెచ్‌సీకి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలుడిపై అత్యాచార, పోక్సో కేసులు నమోదుచేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. నిందితుడిని జూవైనల్ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు.