Elephants ఏన్నాళ్లీ ఏనుగుల బెడద?
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:28 PM
How Long Will the Elephant Menace Last? జిల్లావాసులను గజరాజులు హడలెత్తిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పంటలు, ఆస్తులను నాశనం చేస్తూ.. ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రధాన రహదారులపై హల్‌చల్ చేస్తూ.. వాహనదారులు, ప్రయాణికులకు కూడా భయబ్రాంతులకుగురిచేస్తున్నాయి.

యథేచ్ఛగా పంటలు, ఆస్తుల ధ్వంసం
వరుసగా దాడులు.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు
కుంకీ వచ్చేదెప్పుడో.. ‘మన్యం’లో తరలించేదెప్పుడో?
జియ్యమ్మవలస/భామిని, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులను గజరాజులు హడలెత్తిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పంటలు, ఆస్తులను నాశనం చేస్తూ.. ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రధాన రహదారులపై హల్‌చల్ చేస్తూ.. వాహనదారులు, ప్రయాణికులకు కూడా భయబ్రాంతులకుగురిచేస్తున్నాయి. వాటి దాడిలో ఎంతమంది మృత్యువాత పడుతున్నా.. క్షతగాత్రులవుతున్నా.. స్పందించేవారే కరువయ్యారు. వాటిని తరలించడంలో అటవీ శాఖాధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా కుంకీలంటూ ప్రచారానికే పరిమితమవగా.. అవి వచ్చేదెప్పుడో.. ‘మన్యం’ వాసులకు గజరాజుల బెడద తప్పేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా గురువారం రాత్రి పెదమేరంగి జంక్షన్-బిత్రపాడు మధ్య సుభద్రమ్మవలస గ్రామ సమీపంలో ఆగి ఉన్న వ్యాన్ అద్దాన్ని గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో డ్రైవర్, క్లీనర్, స్థానికులు బెంబేలెత్తిపోయారు. అయితే కాసేపటి తర్వాత పక్కనే ఉన్న పొలాల్లోకి అవి వెళ్లిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం అవి సుభద్రమ్మవలస - వెంకటరాజపురం గ్రామాల మధ్య హల్‌చల్ చేస్తున్నాయి. కాగా వాటి దాడిలో ప్రాణ నష్టం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏనుగులను పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్న ట్రాకర్స్, అటవీశాఖ సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. దీర్ఘకాలింగా వేధిస్తున్న ఏనుగుల సమస్యపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు.
- భామిని మండలంలో ఉన్న మరో నాలుగు ఏనుగులు కూడా ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత రెండు రోజులుగా బిల్లుమడలో సంచరించిన ఏనుగులు గురువారం రాత్రి నేరడికి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం గ్రామ సమీప తోటల్లో ఉన్న ఏనుగులు సాయంత్రం మొక్కజొన్న పొలాల్లో దర్శనమిచ్చాయి. దీంతో వాటిని చూసేందుకు గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు వారిని అప్రమత్తం చేశారు. ఏనుగులు సమీపానికి వెళ్లవద్దని, ఫొటోలు తీయవద్దని సూచించారు. ఏనుగుల సంచారాన్ని బీట్ ఆఫీసర్ దాలినాయుడు, ట్రాకర్స్ పరిశీలిస్తున్నారు.