పట్టపగలే చోరీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:36 AM
మండలంలోని పోతనాపల్లిలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది.

- పోతనాపల్లిలో ఘటన
-రంగంలోకి పోలీసులు, క్లూస్‌టీం
శృంగవరపుకోట, రూరల్ ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతనాపల్లిలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఎస్.కోట-విజయనగరం ప్రధాన రహదారిలో పోతనాపల్లి వద్ద కిలపర్తి కొండమ్మ తన ఇద్దరు కుమారులు, కోడళ్లతో నివాసం ఉంటోంది. అయితే సోమవారం ఉదయం 10 గంటల సమయంలో కొండమ్మ ఉపాధి పనికి వెళ్లింది. ఆమె కోడళ్లు పోతనాపల్లి గ్రామంలోకి వెళ్లారు. పెద్దకుమారుడు చిన్నారిని తీసుకుని అదే గ్రామంలోని మరదలి ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి తాళం వేసి గేటు పక్కన ఉన్న కుండీ కింద ఇంటి తాళం చెవి పెట్టి వెళ్లాడు. అయితే ఉపాధి పనికి వెళ్లిన కొండమ్మ 11.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఇంట్లో కొద్ది నిమిషాలు పనిచేసుకుని తమ కుమారుడు బెడ్‌రూం వైపు వెళ్లగా బీరువా తెరిచి ఉంది. వస్రాలు కిందపడి ఉన్నాయి. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిం ది. ఇంట్లోని రెండు బెడ్ రూమ్‌ల్లోని బీరువాలు తెరిచి ఉన్నాయి. అందులో ఇద్దరి కోడళ్లు, మనవళ్లకు సంబంధించిన 21 తులాల బంగారు ఆభరణాలు, రూ.35 వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నారాయణమూర్తి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం ఎస్‌ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇల్లు మొత్తం పరిశీలన చేసి పలుచోట్ల వేలి ముద్రలు సేకరించారు. అయితే పట్టపగలే దొంగతనం జరగడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఇంటి తాళం పెట్టడం వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అదే విధంగా ఇంట్లో ఎవరూ లేని విషయం గుర్తిం చి, ఇంట్లోకి దర్జాగా వెళ్లి చోరీకి పాల్పడటంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించే పనిలోపడ్డారు. ఎన్నడులేని రీతిలో ఈ ప్రాంతంలో దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.