Share News

Multipurpose Market: జిల్లాకు రెండు టీఎంఎంసీలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:01 AM

Multipurpose Market: జిల్లాకు రెండు ట్రైబల్‌ మల్టీపర్పస్‌ మార్కెట్‌ కేంద్రాలు (టీఎంఎంసీ) మంజూరయ్యాయి. ఈ మేరకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఈ నెల 2న ఆదేశాలు జారీ చేశారు.

Multipurpose Market: జిల్లాకు రెండు టీఎంఎంసీలు

- సాలూరు, సీతంపేటలో ఏర్పాటు

-ఒక్కొక్క భవనానికి రూ.కోటి మంజూరు

పార్వతీపురం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు రెండు ట్రైబల్‌ మల్టీపర్పస్‌ మార్కెట్‌ కేంద్రాలు (టీఎంఎంసీ) మంజూరయ్యాయి. ఈ మేరకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఈ నెల 2న ఆదేశాలు జారీ చేశారు. ధరతి, అబ, జన, చైత్య గ్రామ వత్‌ క్రాస్‌ అభయం (డీఏజేజీయూఏ) పథకంలో భాగంగా రాష్ట్రంలో ఆరు టీఎంఎంసీలు మంజూరయ్యాయి. అందులో జిల్లాకు రెండు కేటాయించారు. సాలూరు, సీతంపేటలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క కేంద్రాన్ని కోటి రూపాయలతో నిర్మించనున్నారు. సీతంపేట పరిధిలోని తురాయిపువలస సంత వద్ద, సాలూరు సంత వద్ద వీటిని నిర్మించనున్నారు. ఈ కేంద్రాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వారు సంతలకు తీసుకొని వచ్చే అటవీ ఉత్పత్తులను ఈ కేంద్రాల ద్వారా విక్రయించవచ్చు. ఉత్పత్తులు ఏమైనా మిగిలిపోతే స్టోరేజ్‌ కూడా చేసుకోవచ్చు. దళారుల బెడద తప్పనుంది. జీసీసీ ద్వారా గిరిజనులకు కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా ఈ కేంద్రాల ద్వారా వి క్రయించనున్నారు. ఐటీడీఏ లేదా గిరిజన కార్పొరేషన్‌ ద్వారా నిత్యావసరాలను విక్రయించడం వల్ల గిరిజనులకు నాణ్యమైన సరుకులు లభ్యమవుతాయి.

గిరిజనులకు ప్రయోజనం

సాలూరు, సీతంపేటలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్‌ మల్టీపర్పస్‌ మార్కెట్‌ కేంద్రాలతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఒక్కొక్క కేంద్రాన్ని కోటి రూపాయలతో నిర్మిస్తాం. మంచి ధర వచ్చినప్పుడు అటవీ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు గిరిజనులకు అవకాశం ఉంటుంది. జిల్లాకు రెండు కేంద్రాలు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

-గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి

Updated Date - Apr 04 , 2025 | 12:01 AM