Share News

what about curreption అక్రమాల సంగతేంటో!

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:45 PM

What about irregularities! జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్యసేవలో బట్టబయలైన అక్రమాలపై ఉన్నతాధికార యంత్రాంగం వైఖరి అనుమానాస్పదంగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది.

what about curreption అక్రమాల సంగతేంటో!

అక్రమాల సంగతేంటో!

ఎన్టీఆర్‌ వైద్యసేవలో అవినీతిపై గప్‌చుప్‌

విచారణ పేరుతో మొదట్లో హడావుడి

ఆపై మెల్లగా నీరుగార్చేందుకు ఎత్తుగడలు

ఓ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కీలక అధికారి

జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్యసేవలో బట్టబయలైన అక్రమాలపై ఉన్నతాధికార యంత్రాంగం వైఖరి అనుమానాస్పదంగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. నెట్వర్క్‌ ఆస్పత్రుల వద్ద మొదలైన ఈ బాగోతంలో టీమ్‌ లీడర్లు, జిల్లా స్థాయి ముఖ్య అధికారుల వరకు ఎవరి స్థాయిలో వారు భాగస్వాములైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయినా చర్యలకు మీనమేషాలు లెక్కించడంలో అంతరార్థం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. నిజాలను నిర్వీర్యం చేసి విచారణను నీరుగార్చేందుకు కొందరు పెద్దలు తెరవెనుక కథ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు పాలకపక్ష నేతల మౌనం తాజాగా కొత్త చర్చకు ఆస్కారమిస్తోంది.

మెంటాడ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్యసేవలో అవినీతికి ఎక్కడ అంకురార్పణ జరుగుతోంది.. ఎన్ని మలుపులు తీసుకుంటోంది.. మాఫియాను తలపించే ఈ ఘరానా బాగోతంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు.. వారి వాటాల సంగతేంటి... తదితర అంశాలపై నెలరోజుల వ్యవధిలో ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు పరిశీలనాత్మక కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇవి బాధ్యుల్లోనే కాకుండా వైద్య ఆరోగ్యశాఖలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత వారంతా అత్యవసర సమావేశాలు పెట్టుకుని ఈ సమాచారం ‘ఆంధ్రజ్యోతి’కి ఎలా చేరుతోందని ఆరా కూడా తీశారు. మరోవైపు అక్రమాల బాగోతంపై శాఖపరమైన విచారణకూ ఆదేశాలిచ్చారు. అయినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. అసలు విచారణ నడుస్తోందా? అర్ధాంతరంగా కొండెక్కిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

- ఈ ఘరానా దోపిడీలో బాధ్యుడిగా ప్రచారంలో ఉన్న ఒక అధికారి ఇటీవల కొంతమంది వద్ద అదంతా టీకప్పులో తుఫాన్‌లా సమసిపోయిందని, అంతా మేనేజ్‌ చేశామని, ఇకపై ఎవరూ ఆందోళన చెందకుండా ఎప్పట్లాగే ‘ఎవరిపని వారు’ చేసుకుపోవచ్చునని చెప్పుకుతిరుగుతున్నట్లు తెలుస్తోంది.

- పాలకొండలో తన సతీమణి ఎండీగా ఓ ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారంలో తనపై చర్యలు లేకుండా రాజకీయ చక్రాన్ని అడ్డుగా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. తన సమీప బందువొకరు ఓ ఎమ్మెల్యే వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఎమ్మెల్యే ద్వారా ఇక్కడి బాస్‌కు ’’ఓ మాట’’ చెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విచారణ ఎలా జరుగుతోందో!

ఈ బాగోతంపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణకు జిల్లాలో ఒక అధికారిని ఆదేశించామని డీఎంహెచ్‌వో చెబుతున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారితో విచారణ వల్ల ప్రయెజనం ఏముంటుందని అడిగితే ఆయన నివేదిక సంతృప్తికరంగా లేదని ఫిర్యాదులొస్తే వేరే అధికారితో మరింత లోతైన విచారణ జరిపిస్తామని చెప్పుకొస్తున్నారు. ఆ అధికారి విచారణ ఎంతవరకు వచ్చిందీ, అసలు జరుగుతున్నదీ లేనిదీ కూడా తెలియడం లేదు.

ఆరోగ్యమిత్రల ఆవేదన

జిల్లాను కుదిపేసిన ఎన్టీఆర్‌ వైద్యసేవలోని అవినీతి వ్యవహారం తమకు తలవంపులు తెస్తోందని, ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా, ప్రజల అనుమానపు చూపులతో మానసికంగా నలిగిపోతున్నామని ఆరోగ్యమిత్రలు తమ ఆవేదనను కొద్దిరోజుల క్రితం విజయవాడలోని సంఘం రాష్ట్రనేతల వద్ద వ్యక్తం చేసినట్టు తెలియవచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల క్లిప్పింగులను వారికి అందజేసినట్టు సమాచారం.దీనిపై స్పందించిన సంఘనేత గోవింద రాష్ట్ర ఎన్టీఆర్‌ వైద్యసేవ ఈవో దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.

- ఎన్టీఆర్‌ వైద్యసేవలో అవినీతి వ్యవహారం ఓ కుదుపు కుదుపుతున్నా జిల్లాలోని పాలకపక్ష ప్రజాప్రతినిధులు ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఎన్టీఆర్‌ వైద్య సేవలో అక్రమాలపై ఓ సీపీఎం నేత కలెక్టర్‌ అంబేడ్కర్‌ను నేరుగా కలిసి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Apr 01 , 2025 | 11:45 PM