రూ.3 కోట్లతో సీసీ కెమెరాలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:12 AM
విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులతోపాటు సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

ఆకివీడు రూరల్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి):విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులతోపాటు సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆకివీడు మండలం అజ్జమూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వద్ద పీ 4లో భాగంగా దాతల సహకారం తో సీసీ కెమెరాలను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ రూ.3 కోట్లతో నియోజకవర్గం నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎస్‌బీఐ సహకారంతో ఆకివీడు హైస్కూల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కెనరా బ్యాంకు సహకారంతోపార్కు, యోగా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని మొదటిసారిగా ఉండి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విరాళాలు అందించిన దాతలను సన్మానించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్, నాయకులు కొత్తపల్లి నాగరాజు, మోటుపల్లి ప్రసాద్, డాక్టర్ బిలాల్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.