Share News

రైతు గుండె కోత

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:53 AM

తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సుబ్బారావు పదెకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మిషన్‌లతో వరి కోతలకు సిద్ధమయ్యాడు. ధాన్యం కోసే ముందు గ్రామంలో ఓ దళారిని సంప్రదించాడు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సుబ్బారావు పదెకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మిషన్‌లతో వరి కోతలకు సిద్ధమయ్యాడు. ధాన్యం కోసే ముందు గ్రామంలో ఓ దళారిని సంప్రదించాడు.

రైతు గుండె కోత
తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో యంత్రాలతో వరి కోత

తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సుబ్బారావు పదెకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మిషన్‌లతో వరి కోతలకు సిద్ధమయ్యాడు. ధాన్యం కోసే ముందు గ్రామంలో ఓ దళారిని సంప్రదించాడు. ధాన్యం కట్టు పొట్టు కింద 75 కేజీల బస్తాకు రూ.1,380కి మాట్లాడు కున్నాడు. తర్వాత కోతలు మొదలుపెట్టాడు. ఈలోగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వెంటనే ఆ షావుకారు ఈ రైతు వద్దకు వచ్చి ‘ధర తగ్గిపోయింది. ఎస్‌ఎల్‌ 126 ధాన్యం ధర రూ.1260 వస్తుంది’ అని చెప్పడంతో రైతు బోరుమన్నాడు. ధాన్యం ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రానికి పంపుదామంటే వర్షం వచ్చి తడిపేస్తుందేమోనన్న భయంతో చేసేది లేక ఆ ధాన్యాన్ని దళారి ఇచ్చిన ధరకే అమ్ముకున్నాడు. అంటే ఎకరానికి ఆరు వేలు చొప్పున రూ.60 వేలు నష్టపోయాడు. దళారి, మిల్లరు కలిపి ఆ మొత్తాన్ని పంచుకున్నారు. ఇది ఒక సుబ్బారావు పరిస్థితే కాదు. మాసూళ్లు చేస్తున్న ప్రతీ రైతు దీనగాథ.

మారిన వాతావరణంతో ఉక్కిరి బిక్కిరి

చిన్నపాటి చినుకులు.. తెరపైకి తేమ బూచి

దోపిడీకి తెరలేపిన దళారులు, మిల్లర్లు

ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి

అన్నదాతల ఆందోళన.. కోతలకు వెనకడుగు

తాడేపల్లిగూడెం రూరల్‌/పెంటపాడు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):వాతావరణ పరిస్థితులు క్షణానికో విధంగా మారడంతో రైతులు మాసూళ్లు చేయాలా ? వద్దా ? అన్నట్టు ఉంది. ఓ గంట పాటు ధాన్యం మాసూళ్లు చేస్తే, మరి కొంతసేపు వాతావరణం మబ్బు లతో రైతుల గుండెల్లో గుబులురేపింది. ఇలా మంగళ వారం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వాతావర ణం భయపెట్టింది. ఎప్పుడు వర్షం వస్తుందో తాము ఇప్పటి వరకు కష్టపడి పండించుకున్న పంట చేతికి వచ్చే సమయానికి ఏమవుతుందో తెలియక వణికిపో తున్నారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటికే 30 శాతం దాళ్వా వరి కోతలు పూర్తికావాలి. వర్షాల కారణంగా 10 శాతం కూడా పూర్తి కాలేదు. పంటలు పూర్తి చేసుకుని ఆనందంగా కోతలు ప్రారంభిద్దామని అనుకున్న రైతుల కు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకున్న ధాన్యాన్ని అరబెట్టుకుని ఎలా ఒబ్బిడి చేసుకోవాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు.

తేమ శాతంతో సతమతం

17 తేమ శాతం చూపిస్తే తప్ప ప్రభుత్వ కేంద్రాల లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. చేసేది లేక కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని సాయంత్రం వాటిపై బరకాలు కప్పుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ఎక్కువ సమయం కురవడం లేదు. అయిన ప్పటికీ కురుస్తున్న అరగంటసేపు కుండపోతలా మారుతోంది. ఇప్పటికే జిల్లాలో వరి కోత యంత్రాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. గంటన్నర పట్టే ఎకరం కోతకు గంటకు సుమారు మూడు వేల వరకు వసూలు చేస్తు న్నారు. వర్షంతోపాటు ఈదురు గాలులు వేస్తుండటంతో కొన్నిచోట్ల పొలాలు నేలనంటాయి. వీటిని కోయాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రైతులు అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. మంగళవారం చిరుజల్లులు పడడంతో రైతులు ఆరబె ట్టుకున్న ధాన్యం కళ్లాలవైపు బరకాలు తీసుకుని పరు గులు పెట్టారు. వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకు న్నారు. అప్పటి వరకూ ఎండగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మారిపోయి వర్షం ప్రారంభమవుతోంది. వాతావరణ శాఖ ద్వారా కూడా వర్షాలపై సరైన సమాచారం రాకపోవడంతో రైతులు కంగారు పడుతున్నారు.

వరి కంకులు నేలకొరిగాయి

సాగు మొదటి నుంచి కష్టపడి పండించిన పంట చివరి దశలో భారీ ఈదురుగాలులు, వర్షంతో వరి కంకులు నేలకొరిగాయి. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం నీరు బయటకు తోడుకుంటున్నాం. ఆదివారం రాత్రి ప్రకృతి రూపంలో భారీ ఈదురుగాలులతో కోత దశకు వచ్చిన చేలు నేలకొరిగి నీళ్లలో తడుస్తున్నాయి. ఇప్పటికే తేమ శాతం పేరుతో మిల్లర్లు నానాయాగి చేస్తున్నారు. ఇప్పుడు తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

– కాటూరి రాజేష్‌, ధర్మాపురం, ఆకివీడు

Updated Date - Apr 16 , 2025 | 12:53 AM