చెత్త చెత్తగా
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:47 AM
పట్టణాల్లో చెత్త సమస్య సంక్లిష్టంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.

పారిశుధ్య కార్మికుల కొరత
కుళ్లిన వ్యర్థాలు, దుర్వాసనతో తప్పని ఇబ్బందులు
ఆంధ్రజ్యోతి పరిశీలన
పట్టణాల్లో చెత్త సమస్య సంక్లిష్టంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఓ వైపు స్వచ్ఛాంధ్రపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కార్యాచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. కూడళ్లలో చెత్త చెదారంతో దుర్వాసన, కుళ్లిన వ్యర్థాలతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెత్త సేకరణకు సరిపడినంత పారిశుధ్య సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కొందరు అవగాహన రాహిత్యంతో రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో చెత్తను కుప్పలుగా పారబోస్తున్నారు. జఠిలంగా మారుతున్న చెత్త సమస్యపై ఆంధ్రజ్యోతి పరిశీలన.
చెత్త కుప్పల స్వాగతం...
తాడేపల్లిగూడెం అర్బన్ : తాడేపల్లి గూడెంలో రోజుకు 80 టన్నుల చెత్త ఉత్ప త్తి అవుతోంది. చెత్త సేకరణకు సరిపడి నంత మంది కార్మికులు లేకపోవడంతో చెత్తకుప్పలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్‌మెంట్‌ల వద్ద ఉన్న ఖాళీ స్థలాలు, ఎల్‌ఐసీ ఆఫీస్ వెనుక ఉన్న వాసవీ కళాశాల సమీపంలోను బయటి నుంచి తీసుకువచ్చిన మట్టి, చెత్తను కుప్పలుగా వేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ నిట్ ప్రహరీ సమీపంలో రహదారికి ఇరువైపులా చెత్తను వేసి అక్కడే తగులబెడుతున్నారు. ఆ మంట నుంచి వస్తున్న పొగ కారణంగా నిట్ విద్యార్థులతో పాటు పక్కనే హైవేపై ప్రయాణాలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందుల సంచారం ఎక్కువైంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
నరసాపురం : ప్రధాన రోడ్లపైనే చెత్త...
నరసాపురం : మునిసి పాల్టీ రోజువారీ చెత్త సేక రణ చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు చెత్త, చెదారంతో నిండిపోతు న్నాయి. 31 వార్డుల నుంచి రోజుకు 30 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలో శానిటరీ సిబ్బంది కొరత ఉండడంతో ప్రతీ రోజు చెత్త సేకరణ జరగడం లేదు. రైతుబజార్, శివా లయం సెంటర్, ఆన్నపూర్ణ థియేటర్, భూపతి వారి వీధి, రాయపేట, తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరు కుపోతున్నాయి. చెత్త కుండీలు లేకపోవడంతో రోడ్లపైనే పారేయడంతో ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.
తణుకు : ఎక్కడి చెత్త అక్కడే...
తణుకు : తణుకులో ఎక్కడ చెత్త అక్కడే అన్న చందంగా ఉంది. ప్రధాన రహదారుల వెం బడి వున్న చెత్తను తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల డంపింగ్ చేసిన ప్రాంతాల్లో చెత్తను ఆలస్యంగా తీస్తున్నారు. ఈ పరిస్థితి వేల్పూరు రోడ్డులో డంపింగ్ చేసే ప్రాంతంలో నెలకొనడంతో అక్క డ చెత్త పేరుకుపోతోంది. కార్పొరేషన్ బ్యాంకు వీధిలో చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. పట్టణం లో 34 వార్డులను ఏడు జోన్లుగా విభజించారు. చెత్త సేకరణకు పది ట్రాక్టర్లు, 35 వీల్ బార్‌లు ఉపయోగిస్తున్నారు. 150 మంది కార్మికులు ఉండగా వీరిలో 20 మంది రెగ్యులర్, మిగిలిన వారు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
చెత్తతో పాదచారుల పాట్లు ...
భీమవరం టౌన్:పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను ఒకచోట చేర్చి అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చేర్చేందుకు ఆలస్యం కావటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. మొత్తం 33 కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తున్నారు. గంధం వెంకయ్యనాయుడు వీధిలోని సచివాలయం వద్ద చెత్తను ఉంచటంతో ఆ ప్రాంత ప్రజలకు, పాదచారులకు ఇబ్బందికకరంగా మారుతున్నాయి. చెత్తను తొలగించడంలో ఆలస్యం జరిగిందా ? పందులు, కుక్కలు చెత్తను లాగేయడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రతతోపాటు వాసనలతో దుర్గంధంగా మారుతోంది. కొన్నిచోట్ల చెత్త తొలగింపు ఆలస్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
తేతలి హైవేపై పొగతో..
తణుకు రూరల్ : తణుకు–తాడేపల్లిగూడెం మార్గంలోని తేతలిలో పంచాయతీ పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్తను రోడ్డుకు ఇరు వైపులా వేస్తున్నారు. దీనికి నిప్పు పెట్టడంతో పొగ రహదారిపైకి వచ్చి ప్రయాణికులు, వాహ నదారులు ఇబ్బంది పడుతున్నారు. చెత్తకు ఒకే సారి నిప్పుపెట్టడం వల్ల ఎదురుగా వచ్చే వాహ నాలు కనిపించని పరిస్థితి ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. చెత్త డంపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా షెడ్‌లను నిర్మించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చెత్తకు పంచాయతీ సిబ్బంది నిప్పు పెట్టలేదని గ్రామ కార్యదర్శి తెలిపారు.