Share News

టెన్షన్‌ పడొద్దు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:52 AM

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే వుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సం దర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన నివేదికలో తేలింది.

   టెన్షన్‌ పడొద్దు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీపీ బాధితులు అధికం

మూడో స్థానంలో ఏలూరు, ఆరో స్థానంలో పశ్చిమ

గుండె వ్యాధుల తీవ్రతలో 8 – 15

కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో 15 – 20 స్థానాలు

పది రకాల వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే.. వివరాలు వెల్లడించిన సీఎం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే వుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సం దర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన నివేదికలో తేలింది. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవాప్యంగా జిల్లాను యూనిట్‌గా తీసుకుని పది రకాల వ్యాధులపై సర్వే చేపట్టిం ది. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనలో భాగంగా ప్రధా నంగా ఎదుర్కొంటున్న వ్యాఽధులకు మూలాలు, వాటి వెనుకవున్న కారణాలను గుర్తించింది. గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి రోగాల వరకు ఏయే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదవు తున్నాయనే దానిపై పరిశోధన చేయగా సరి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యాధుల్లో ఏలూరు ముందంజ

హైపర్‌టెన్షన్‌ : రాష్ట్రంలో 18 ఏళ్లకుపై వయసున్న 2.15 కోట్ల మంది(52.43%)కి స్ర్కీనింగ్‌ చేస్తే అందులో 19.78 లక్షల మందికి (9.2%) హైపర్‌ టెన్షన్‌ నమోదైంది. వీరిలో మహిళలే అధికం. ఇక రాష్టంలో జిల్లాల వారీగా చూస్తే ఏలూరు జిల్లాలో 98,337 మందితో నాలుగో స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలో 91,495 మందితో ఆరో స్థానంలో వుంది.

డయాబెటిస్‌ : ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో పురుషులే అధికంగా వున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఏలూరు జిల్లా 54,765 మందితో ఏడో స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా 49,886 మందితో పదో స్థానంలో వుంది.

డయాబెటిస్‌/హైపర్‌టెన్షన్‌ : ఈ హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ రెండింటితో బాధపడుతున్న వారు లక్షా 29 వేల 729 మందితో ఏలూరు జిల్లా టాప్‌లో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా లక్షా 11 వేల 327 మందితో నాలుగో స్థానంలో వుంది.

గుండె సమస్య : గుండె హృదయాంతర గోళ వ్యాధులతో ఏలూరు జిల్లాలో 12 వేల 678 మంది బాధపడుతూ ఎనిమిదో స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి జిల్లా 9,955 మందితో 15వ స్థానంలో నిలిచింది.

కాలేయ వ్యాధులు : కాలేయ సంబంధిత వ్యాధులతో ఏలూరు జిల్లాలో ఐదు వేల 106 మంది బాధపడుతూ తొమ్మిదో స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి 787 మందితో 20వ స్థానంలో నిలిచింది.

నరాల వ్యాధులు : నరాల సంబంధిత వ్యాధులతో ఏలూరు జిల్లాలో 4,027 మంది బాధపడుతూ 13వ స్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి 3,461 మందితో 20 స్థానంలో ఉంది.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు : ఏలూరు జిల్లాలో ఆరు వేల 819 మందితో 15వ స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి 5,040 మందితో 20వ స్థానంలో నిలిచింది.

ఆస్తమా : వాయు కాలుష్యం, స్మోకింగ్‌ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియా (సీవోపీడీ)తో బాధపడుతున్న వారు ఏలూరు జిల్లాలో 1,287 మందితో 20వ స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి 576 మందితో 25వ స్థానంలో నిలిచింది.

జూన్‌ నాటికి స్ర్కీనింగ్‌ పూర్తి

ఈ ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో అంద రికీ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారినపడే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చనని చెప్పడమే ప్రభు త్వ ముఖ్య ఉద్దేశం. వంటలు, టీ, కాఫీల్లో ఉప్పు, పంచదారల వాడకం శ్రుతి మించడ డంతో ఎక్కువ మంది హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, గుండె నొప్పి, లివర్‌, కిడ్నీలు చెడిపోవడం, ఊబకాయం వంటి వాటితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

Updated Date - Apr 08 , 2025 | 12:53 AM