గాలి.. వాన
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:46 AM
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. గాలి.. వానతో రైతులు హడలి పోయారు.

గాలికి విరిగిపడిన చెట్లు
తోటల్లో నేల రాలిన మామిడి
వర్షంతో తడిచిన ధాన్యం, మిర్చి
విద్యుత్ సరఫరాలో అంతరాయం
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. గాలి.. వానతో రైతులు హడలి పోయారు. ఏలూరు నగరంలో గాలి ధాటికి పలు దుకాణాల వద్ద హోర్డింగ్‌లు ఎగిరిపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు, కల్లాలో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చితో పాటు పొగాకు తడిచింది. తోటల్లో మామిడి నేలరాలింది. మరోవైపు జోరువానతో వాతావరణం చల్లబడడంతో ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగింది.
ఏలూరు సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖా తంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మంగళ వారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మామిడితోటలలో కాయలు రాలిపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. గాలి తీవ్రతకు చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఏలూరు నగరంతో పాటు జిల్లాలో ని చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి. ముసునూరు, టి.నరసాపురం, వేలేరుపాడు, పోలవరం, బుట్టా యగూడెం, దెందులూరు, భీమడోలు, ఉంగుటూ రు, నిడమర్రు, కైకలూరు తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏలూరు మండలం మాదేపల్లిలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫ రా మెరుగుపడలేదు. ఈదురు గాలులతో మళ్లీ అంతరాయం కలిగింది.
పరుగులు పెట్టిన రైతులు
పెదపాడు మండలంలో జాతీయ రహదారి పై ఆరబెట్టిన ధాన్యం కాపాడుకోడానికి రైతులు పరుగులు తీశారు. కొయ్యలగూడెం మండలం లో తోటల్లో మామిడి కాయలు నేల రాలాయి. పొగాకు, మిర్చి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. భారీ వర్షంతో చెట్లు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెదవేగి మండలంలో కొన్ని చోట్ల దుకాణాలపై హోర్డింగ్స్ ఎగిరిపడ్డాయి. కల్లాల్లో మొక్కజొన్న కండెలు తడిసిపోయాయి. వర్షం ఉద్యాన పంటలకు మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామవరపు కోట మండలంలో గాలి, వర్షంతో చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. అరటి, మామిడి పంటలకు నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు కల్లాల్లో మిర్చి పంటపై రైతులు టార్పాలిన్‌లు కప్పారు. దిబ్బగూడెంలో పొగాకు పంటపై టార్పాలిన్‌లు గాలికి ఎగిరిపోయాయి. పలు చోట్ల మామిడి నేల రాలింది. చిర్రివారి గూడెంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కుక్కు నూరు మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. చీరవల్లిలో వడగండ్ల వర్షం పడింది. కూలీల కొరతతో మిర్చి కోతలు పూర్తి కాలేదు. క్వింటాళ్ల కొద్దీ మిర్చి కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు గాలి, వాన ఉపశమనం ఇచ్చింది. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికంగా ఉండగా సాయంత్రం ఆరుగంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకుని, గాలులు, వర్షంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. పలుచోట్ల జోరు వానతో రోడ్లపై నీరు నిలిచింది.